అమ్మా.. ఇక్కడో మమ్మీ ఉంది!!
అమ్మా.. అమ్మమ్మ ఇంట్లో అటక మీద 'మమ్మీ' ఉంది!! ఓ జర్మన్ పిల్లాడు వేసిన కేక ఇది. అవును.. అత్యంత పురాతనమైన ఈజిప్షియన్ మమ్మీ ఒకటి అతడికి తన అమ్మమ్మ ఇంట్లో అటకమీద కనపడింది. చాలా దశాబ్దాలుగా ఎవ్వరూ కదిలించకపోవడంతో అది ఒక చెక్కపెట్టెలో ఒక మూల అలా పడి ఉంది. ఆ పిల్లాడి పేరు అలెగ్జాండర్. ఉత్తర జర్మనీలోని డైఫోల్జ్ నగరంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఆడుకుంటూ అటక ఎక్కాడు. అక్కడ ఏవేం ఉన్నాయోనని గాలించడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఓ పెద్ద చెక్కపెట్టె కనిపించింది. చిన్న వయసు, ఏముందో చూడాలనే ఉత్సాహం, కుతూహలం అతడిని ఆగనివ్వలేదు. వెంటనే ఎలాగోలా కష్టపడి చెక్కపెట్టె తలుపు తెరిచాడు. తీరా చూస్తే.. లోపలున్నది ఓ మమ్మీ!! కొద్దిసేపు భయపడినా, తర్వాత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.
అయితే, అసలు అక్కడున్నది నిజమైన పురాతన ఈజిప్షియన్ మమ్మీయేనా, లేకపోతే దానికి నకలు లాంటిది ఏమైనా చేయించి పెట్టుకున్నారా అనే విషయాన్ని తేల్చాలని నిపుణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలెగ్జాండర్ తండ్రి లట్జ్ వుల్ఫ్ గ్యాంగ్ కెట్లర్ ఓ దంతవైద్యుడు. తన తండ్రి ఉత్తర ఆఫ్రికాలో 1950 కాలంలో ప్రయాణించేటప్పుడు ఈ పెట్టె తీసుకుని దాన్ని జర్మనీకి తెచ్చారని ఆయన చెప్పారు. అయితే దాని గురించి ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పలేదని తెలిపారు. జర్మనీలోని ఉన్నత కుటుంబాల్లో 1950ల కాలంలో 'మమ్మీ అన్రాపింగ్ పార్టీలు' చాలా ప్రముఖంగా జరిగేవని ఆయన వివరించారు. బహుశా తమ ఇంట్లో ఉన్నది అసలు మమ్మీ కాదేమోనని, దానికి నకలు అయి ఉంటుందని భావించారు. దానికి ఎక్స్-రే తీయడం తప్ప ఈ విషయం నిర్ధారించుకోడానికి మరో మార్గం ఏమీ లేదని తెలిపారు.