ఉత్తరప్రదేశ్ గిన్నీస్ రికార్డు!
లక్నో: ఒక మంచి కార్యక్రమంతో ఉత్తరప్రదేశ్ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. అతి తక్కువ సమయంలో అత్యధిక మొక్కలు నాటి గిన్నీస్ లో చోటు సంపాదించింది. రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం 'క్లీన్ యూపీ, గ్రీన్ యూపీ'కి పిలుపునిచ్చింది. దీనికి స్పందించి రాష్ట్రవ్యాప్తంగా 8 గంటల్లో 10 లక్షల మొక్కలు నాటారు. ఈనెల 7న ఉదయం 8.30 నుంచి 4.30 గంటలోపు 10.15 ఒక్కలు నాటినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
అటవీ, నీటిపారుదల శాఖల సహకారంతో అన్నివర్గాలు వారు మొక్కలు నాటడంతో రికార్డు సొంతమైందన్నారు. సాయ్ పాయ్ లో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు గిన్నీస్ నిర్వాహకులు రికార్డు తాలూకు ధ్రువపత్రాన్ని అందజేశారు. తమ ప్రభుత్వం సాధించిన రికార్డు గురించి ట్విటర్ ద్వారా అఖిలేశ్ తెలిపారు. ఆయన కూడా హమీపూర్ జిల్లాలో మౌదాహ డామ్ వద్ద రావి మొక్క నాటారు.