చెచెన్యాలో మిలిటెంట్ల కాల్పులు
10 మంది పోలీసుల మృతి
ఎదురుకాల్పుల్లో 9 మంది తీవ్రవాదుల హతం
గ్రోజ్నీ: రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో మిలిటెంట్లు గురువారం పేట్రేగిపోయారు. పలుకార్లలో వచ్చిన తీవ్రవాదులు ఒక చెక్‌పోస్టు వద్ద ఉన్న 10 మంది ట్రాఫిక్ పోలీసులను కాల్చిచంపారు. తీవ్రవాదులు వస్తున్న కార్లను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులను కాల్చి చంపారని చెచెన్ అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తీవ్రవాదులు సెంట్రల్ గ్రోజ్నీలోని ఒక ఆరంతస్థుల భవనాన్ని ఆక్రమించుకున్నారని, ఆరు గంటలకుపైగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని తెలిపారు.
మరికొందరు తీవ్రవాదులు సిటీ స్కూల్లో ఉన్నారని, వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కాకసస్లో ఆందోళనలు సర్వసాధారణమైనప్పటికీ, కదిరోవ్ తీసుకున్న పటిష్ట భద్రతా చర్యలతో కొన్నేళ్లుగా గ్రోజ్నీలో ఎలాంటి హింసాయుత సంఘటనలూ చెలరేగలేదు.