అజెర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ అనుమానం
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లోని అక్తావ్ సమీపంలో బుధవారం విమానం కూలడానికి వెలుపలి శక్తుల ప్రమేయమే కారణమని అజెర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వెలుపలి భౌతిక, సాంకేతిక పరమైన ప్రమేయం వల్లే విమానం కూలినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని శుక్రవారం వెల్లడించింది. ఈ విమానం కుప్పకూలడానికి రష్యా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థే కారణమని అంతకు ముందు వార్తలొచ్చాయి.
రష్యా వైమానిక విభాగం ప్రతినిధి యడ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రోజ్నీ, వ్లాడికవ్కాజ్‌లలోని మౌలిక వసతులు, జనావాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. అందుకే గ్రోజ్నీలో ల్యాండ్ చేయకుండా విమానాన్ని దారి మళ్లించారని తెలిపారు. ‘దీన్నిబట్టి చూస్తే, ఆ ప్రాంతంలోని గగనతలాన్ని మూసివేసినట్లు అర్థమవుతోంది. అంటే, ఆ జోన్‌లోకి వచ్చే ఏదైనా విమానం తక్షణమే బయటకు రావాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదమే’అని విశ్లేషకులు అంటున్నారు.
‘విమానం గ్రోజ్నీలో ల్యాండయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. అయితే, డ్రోన్ దాడుల భయంతో వేరే విమానాశ్రయాల్లో ల్యాండ్ చేయాలని అధికారులు పైలట్‌కు సూచించారు. అందుకే, పైలట్ అక్తావ్ ఎయిర్‌పోర్టు దిశగా విమానాన్ని మళ్లించారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురుస్తున్న దట్టమైన మంచు ప్రమాదానికి కారణమైంది’అని యడ్రోవ్ వివరించారు. కానీ, రష్యా మీడియా విమాన ప్రమాదం గురించిన అసత్యాలు ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి సిబిహా ఆరోపించారు. క్షిపణి దాడిలో దెబ్బతిన్న విమానంలో ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి రష్యా అధికారులు సముద్రం దాటాలని పైలట్‌పై ఒత్తిడి చేశారని విమర్శించారు.
విమానం కూలిన తర్వాత కేబిన్ నుంచి భారీగా పొగలు వస్తున్నట్లుగా చూపే వీడియోలు, ఫొటోలు కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. విమానం ముక్కలై మంటలు అంటుకోవడం, కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నేలను తాకి నల్లని పొగలు కమ్ముకుంటున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. ఘటనా ప్రాంతంలో విమానం ధ్వంసమైన తీరును గమనిస్తే రష్యా మిలటరీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లే నేలకూలినట్లు కనిపిస్తోందని యూకేకు చెందిన ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్ మ్యాట్ బోరీ విశ్లేషించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. రష్యన్లే ఆ విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్ జాతీయ భద్రతాధికారి అండ్రీ కొవలెంకో చెప్పారు. యుద్ధం జరుగుతున్న వేళ గ్రోజ్నీ గగనతలాన్ని రష్యా మూసివేయకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment