దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినం: మోదీ
న్యూఢిల్లీ: జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందిస్తూ.. దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినమని అభివర్ణించారు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ఇస్రో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అనంతరం.. ఆయన ఢిల్లీ నుంచి సార్క్ దేశాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
పరిధులు లేని స్నేహానికి ఇవాళ నాంది పడిందని, సార్క్ దేశాలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చామని మోదీ అన్నారు. మన ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో దక్షిణాసియా దేశాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై దక్షిణాసియా దేశాల ప్రతినిధులు, పలువురు రాజకీయ ప్రముఖులు.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వది కావడం విశేషం.