gsrkr vijaykumar
-
పొగాకు సమాఖ్యకు ఫిబ్రవరి 9న ఎన్నికలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (ఏపీ టుబాకో గ్రోయర్స్ కోఆపరేటివ్ యూనియన్) నూతన పాలకవర్గ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ జీఎస్ఆర్కెఆర్ విజయకుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సమాఖ్య అధ్యక్షునిగా కట్టా శివయ్య పదవీ కాలం ముగిసి రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో సమాఖ్య పర్సన్ ఇన్చార్జ్ కమిటీ (పీఐసీ) పాలనలో ఉంది. ఫిబ్రవరి 29న నూతన పాలకవర్గ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అధికారిగా అద్దంకి సబ్‌డివిజనల్ సహకారాధికారి స్వర్ణ నాగేశ్వరరావును నియమించారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలను జిల్లా సహకారాధికారి పి.శరభయ్య వివరించారు. సమాఖ్యలో మొత్తం 18 మంది డెరైక్టర్లను సభ్యులు రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. వీరిలో ఒకరిని అధ్యక్షునిగా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులు (అధికారులు)ంటారు. జిల్లాసహకారాధికారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్లు ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. జనవరి 5న సమాఖ్య పీఐసీ/సీఈఓ అర్హులైన ఓటర్ల జాబితా తయారు చేస్తారు. 11న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. 17న ఎన్నికల అధికారికి ఓటర్ల జాబితా సమర్పణ, 21న ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా పరిశీలన, 28న ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్ జారీ చేస్తారు. 29న ఎన్నికల అధికారి ఎన్నికల ప్రకటనను జారీ చేస్తారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల స్వీకరణ, 2న నామినేషన్ల పరిశీలన, 3న నామినేషన్ల ఉపసంహరణ, 9న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం ఉంటుంది. -
ఒంగోలు వల్ల జిల్లా మొత్తానికి చెడ్డపేరు వస్తోంది
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలు నగరంలో ఓటు హక్కుకు సంబంధించి పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో జిల్లా మొత్తానికి చెడ్డపేరు వ స్తోందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఒంగోలు ఆర్డీఓను ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా అబ్జర్వర్ మధుసూదనరావుతో కలిసి నియోజకవర్గస్థాయి అధికారులు, తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రతిరోజూ తనకు ఎస్ఎంఎస్ రూపంలో నివేదికలు అందించాలని ఆదేశించారు. ఏబీసీడీలు కూడా నొక్కలేరా.. ‘ప్రతి తహసీల్దార్‌కు డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చాం. కీలకమైన ఆ సిగ్నేచర్‌ను ఆపరేట్ చేయలేకపోతున్నారు. ఏబీసీడీ అనే లెటర్స్ కూడా కొట్టలేకపోతున్నారు. పైగా కంఫ్యూటర్ ఆపరేటర్‌కు వాటిని ఇస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే మిమ్మల్ని బయటకు పంపించి కంప్యూటర్ ఆపరేటర్లను తహసీల్దార్లుగా చేయాల్సి వస్తుందేమోనని’ కలెక్టర్ వ్యాఖ్యానించారు. మార్కాపురం ఆర్డీఓను అడిగితే తహసీల్దార్ పేరు చెప్పడం, తహసీల్దార్ అడిగితే కంప్యూటర్ ఆపరేటర్ పేరు చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. జిల్లాలో చేతగానివారు, పనికిమాలినవాళ్లు ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు పనిచేస్తూ కూడా ఎందుకు అనిపించుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఓటర్ల దరఖాస్తులు ప్రతిరోజూ అప్లోడ్ చేయాలి: రోల్ అబ్జర్వర్ ఓటర్లను విచారించిన అనంతరం ఆ దరఖాస్తులను ఏరోజుకారోజు అప్లోడ్ చేయాలని రోల్ అబ్జర్వర్ మధుసూదనరావు ఆదేశించారు. ఒంగోలులో ఓటర్ల నమోదుకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని సకాలంలో విచారణ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు లేకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.