పంపేందుకు ప్లాన్
గార్డుల తొలగింపునకు రంగం సిద్ధం!
ఇప్పటికే ముగ్గురిపై వేటు!
సర్వజనాస్పత్రిలో గాడితప్పిన సెక్యూరిటీ
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుల తొలగింపునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురిని విధుల్లోకి రావద్దని చెప్పిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు మరికొందరిని తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.
'జై బాలాజీ'కి సెక్యూరిటీ బాధ్యత
సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ బాధ్యతను ఈ ఏడాది మే నుంచి తిరుపతికి చెందిన 'జై బాలాజీ' ఏజెన్సీ తీసుకుంది. 500 పడకలున్న ఆస్పత్రిలో ప్రతి 30 పడకలకు ఉదయం షిప్ట్‌లో ఇద్దరు, మధ్యాహ్నం, రాత్రి షిఫ్టుల్లో ఒక్కొక్కరు చొప్పున సెక్యూరిటీని ఉంచాలన్న నిబంధన ప్రకారం మొత్తం 74 మంది సెక్యూరిటీ విధులు నిర్వర్తించాల్సి ఉంది. అప్పటికే పాత ఏజెన్సీ కింద 27 మంది పని చేస్తుండగా మిగిలిన వారిని సదరు ఏజెన్సీ నియమించుకుంది.
ఇప్పుడేం జరిగిందంటే..:
ఆస్పత్రి యాజమాన్యం నిత్యం సెక్యూరిటీ ఏజెన్సీ పనితీరును బేరీజు వేస్తూ మార్కులు వేస్తే ఆ మేరకు వారికి నెలవారీగా డబ్బులు విడుదలవుతాయి. ఈ సంస్థ సెక్యూరిటీ ఏర్పాటు కోసం నెలకు రూ.4.95 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. పనితీరు అధ్వానంగా ఉండడంతో పర్సంటేజ్ తక్కువగా వచ్చి నిధులు కూడా తగ్గాయి. ఈ క్రమంలో ఏం చేయాలో తోచని జైబాలాజీ సిబ్బంది అగ్రిమెంట్ కాపీని ఓ సారి తిరిగేసి జరిగిన 'తప్పు'ను తెలుసుకున్నారు. ఉదయం షిఫ్ట్‌లో ప్రతి 30 పడకలకు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉండాల్సిన అవసరం లేదని గ్రహించారు. 500 పడకల్లో మొదటి 30 పడకలకు మాత్రమే ఇద్దరుంటారని, మిగిలిన 470 పడకల్లో 30 పడకలకు ఒక్కో గార్డు చొప్పున విధుల్లో ఉండాలని అగ్రిమెంట్లో ఉందని సంస్థ ప్రతినిధి తేల్చారు. ఈ లెక్కన ఆస్పత్రిలో ఉండాల్సింది 57 మంది మాత్రమేనని చెబుతున్నారు.
రచ్చకెక్కిన వివాదం
సెక్యూరిటీ సంస్థ లెక్క ప్రకారం ఇప్పుడు ఉండాల్సిన దానికంటే 15 మంది వరకు అదనంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎవరిని తొలగించాలో దిక్కుతోచక కొన్నాళ్లుగా 'కారణాలు' వెతకడం ప్రారంభించారు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ధర్మవరంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఉదయం 10 గంటలకు మద్యం సేవించారు. వారిలో ఇద్దరు అదే రోజు రాత్రి 8 గంటలకు విధులు (నైట్‌షిఫ్ట్) నిర్వర్తించారు. మరుసటి రోజు వారిని పిలిపించిన సంస్థ ప్రతినిధి ఇక ఉద్యోగంలోకి రావద్దని చెప్పారు. ఎందుకని వారు అడగడంతో మద్యం తాగి విధులకు వచ్చారని చెప్పారు. దీంతో తాము ఉదయం మద్యం తాగిన మాట వాస్తవమేనని, అయితే రాత్రి విధులను సక్రమంగానే చేశామన్నారు. దీన్ని పట్టించుకోని సంస్థ ప్రతినిధి వారితో మద్యం తాగినట్లు లేఖ రాయించుకుని తాను ఫోన్ చేసే వరకు రావద్దని ఆదేశించారు. ఆ రోజు డ్యూటీలో లేని ఓ సెక్యూరిటీ గార్డును కూడా ఇదే కారణంతో విధులకు రావద్దని చెప్పి లేఖలో సంతకం చేయించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆ ముగ్గురు సెక్యూరిటీ గార్డులు కొన్ని రోజులుగా ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ వివాదం కాస్తా రచ్చకెక్కుతుండడంతో బుధవారం కార్మిక సంఘం నేతలను పిలిపించుకున్న ఏజెన్సీ ప్రతినిధి చిరంజీవి.. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ఎంఓ వైవీరావుతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సంఖ్య తగ్గకుండా చూడాలని కార్మిక సంఘం నాయకులు అధికారులను కోరగా అది తమ చేతుల్లో లేదని వారు స్పష్టం చేశారు. అగ్రిమెంట్ ప్రకారం సిబ్బందితో పని చేయించాలని ప్రతినిధికి సూచించారు.