gudatipally
-
దిగ్బంధంలో ‘గుడాటిపల్లి’
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుడాటిపల్లికి వెళ్లే రోడ్డు, కట్ట మూసివేత పనులు శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల పహారా మధ్య ప్రారంభమయ్యాయి. దాదాపు 400మందికి పైగా పోలీసులు మోహరించారు. గుడాటిపల్లిలో నిర్వాసితులను ఆ పనుల వద్దకు రానీయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో కట్టడి చేశారు. నిర్వాసితులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గ్రామస్తులు రోడ్డుపైనే దాదాపు5 గంటలకి పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని మహిళలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌కు, మిగిలిన వారిని మద్దూరు, చేర్యాల పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో పెండ్యాల సౌజన్య అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. కాగా, అర్ధరాత్రి నుంచి కట్టనిర్మాణ పనులు చేపట్టడంతో తాగునీరు సరఫరా అర్ధాంతరంగా ఆగిపోయింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కట్ట నిర్మాణ పనులు రాత్రికి రాత్రే ప్రారంభించడం ఏమిటని? పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిర్వాసితులు దుమ్మెత్తిపోశారు. కాగా, గుడాటిపల్లి గ్రామంతో పాటు పరిధిలోని తండాలను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. నిర్వాసితుల ఆందోళన కవరేజ్ చేసేందుకు మీడియాను సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా, ఇన్నేళ్లుగా కలసిమెలసి ఉన్న గుడాటిపల్లి వాసులు ఇక అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావడంతో కంటతడి పెట్టారు. హుస్నాబాద్, గౌరవెల్లి, నందారం క్రాస్ ఇలా పలుచోట తాత్కాలికంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో సర్పంచ్ పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాత్రి 9 గంటలకు గౌరవెల్లి ప్రాజెక్టు సమీపంలోని గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చు న్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని. కానీ ప్రభుత్వం ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. పరిహారం వచ్చేంత వరకు తాను ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఆయనకు తోడుగా కొందరు యువ తీయువకులు సైతం దీక్షలో కూర్చున్నారు. -
18న గుడాటిపల్లికి టీపీసీసీ నేతలు
హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డిని భూనిర్వాసితులు శనివారం కలిసి విన్నవించారు. గుడాటిపల్లిలో 60 రోజులుగా దీక్షలు చేపట్టిన ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించనున్నట్లు నేతలు తెలిపారని భూనిర్వాసితులు పేర్కొన్నారు. కలిసిన వారిలో జి.రాజిరెడ్డి, చంద్రారెడ్డి, ఎన్.బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, రమేశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, బాపురెడ్డి, భిక్షపతి ఉన్నారు.