దిగ్బంధంలో ‘గుడాటిపల్లి’ | Tension at Gudatipally about Gouravelli project: | Sakshi
Sakshi News home page

దిగ్బంధంలో ‘గుడాటిపల్లి’

Published Sun, Mar 5 2023 6:27 AM | Last Updated on Sun, Mar 5 2023 6:27 AM

Tension at Gudatipally about Gouravelli project: - Sakshi

రోడ్డుపై ఆందోళన చేస్తున్న మహిళలు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన  గుడాటిపల్లికి వెళ్లే రోడ్డు, కట్ట మూసివేత పనులు శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల పహారా మధ్య ప్రారంభమ­య్యాయి. దాదాపు 400మందికి పైగా పోలీసులు మోహరించారు. గుడాటిపల్లిలో నిర్వాసితులను ఆ పనుల వద్దకు రానీయకుండా పోలీసులు భారీ బందోబస్తుతో కట్టడి చేశారు.  నిర్వాసితులు,  పోలీ­సుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

గ్రామ­స్తులు రోడ్డుపైనే  దాదాపు5 గంటలకి పైగా  బైఠా­యించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా­రు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని మహిళలను హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు, మిగిలిన వారిని మద్దూరు, చేర్యాల పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో పెండ్యాల సౌజన్య అనే మహిళ చేతికి గాయాలయ్యాయి. కాగా, అర్ధరాత్రి నుంచి కట్టనిర్మాణ పనులు చేపట్టడంతో తాగునీరు సరఫరా అర్ధాంతరంగా ఆగిపోయింది.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా కట్ట నిర్మాణ పనులు రాత్రికి రాత్రే ప్రారంభించడం ఏమిటని? పూర్తిస్థాయిలో  పరిహారం ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని  నిర్వాసితులు దుమ్మెత్తిపోశారు. కా­గా, గుడాటిపల్లి గ్రామంతో పాటు పరిధిలోని తండాలను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు.  నిర్వాసితుల ఆందోళన కవరేజ్‌ చేసేందుకు మీడి­యాను సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా, ఇన్నేళ్లుగా కలసిమెలసి ఉన్న గుడాటిపల్లి వాసులు ఇక అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావడంతో కంటతడి పెట్టారు. హుస్నాబాద్, గౌర­వెల్లి, నందారం క్రాస్‌ ఇలా పలుచోట తాత్కాలి­కంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఆమరణ నిరాహార దీక్షలో సర్పంచ్‌
పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం రాత్రి 9 గంటలకు గౌరవెల్లి ప్రాజెక్టు సమీపంలోని గుడాటిపల్లి సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చు న్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ  భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని. కానీ ప్రభుత్వం ఎక్కడా ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు.  పరిహారం వచ్చేంత వరకు తాను ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఆయనకు తోడుగా కొందరు యువ తీయువకులు సైతం దీక్షలో కూర్చున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement