జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు తీసుకొస్తున్న దృశ్యం
అక్కన్నపేట (హుస్నాబాద్): ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామా?.. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, అందులో సూచించిన దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోవడం మామూలైపోయింది. కానీ అన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే నట్టేట మునగడం ఖాయం. తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వాహనం నడిపి ఏకంగా ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది.
పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ..
హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్లను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి హుస్నాబాద్ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌కు రోడ్డుపై సరైన అవగాహన లేక గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నారు.
ఈ క్రమంలో బంగారు లొద్దితండా దాటాక రామవరం వైపు వెళ్లాల్సిన ఉన్నా.. గుడాటిపల్లి వైపు మళ్లారు. మ్యాప్‌లో చూపించినట్టుగా ముందుకువెళ్లారు. కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీళ్లు నిలిచాయేమో అనుకుని ముందుకెళ్లాడు. క్యాబిన్ వరకూ నీళ్లు వచ్చాయి. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం స్థానికులు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు.
రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించాలి
నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టడంతో వెళ్లడానికి దారి లేదని స్థానికులు తెలిపారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర నీరు నిలిచి ఉంటుందని వివరించారు. రోడ్డుకు అడ్డుగా పెద్ద గోడ నిర్మించాలని.. లేకుంటే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఇంతకుముందు సెప్టెంబర్ 7న ఓ లారీ డ్రైవర్ ఇలాగే గూగుల్ మ్యాప్ చూస్తూ.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లారని.. ఇప్పుడు డీసీఎం వ్యాన్ వెళ్లిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment