కారు రేసులో గుడిమళ్ల రవికుమార్
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కే అప్పగించారు. కాగా రేసులో జేఏసీ నేత గుడిమళ్ల రవికుమార్ ముందున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ఆశావాహులందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చి...బాగా చదువుకున్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. అయితే అభ్యర్థి పేరును కేసీఆర్ శుక్రవారం అధికారంగా ప్రకటించనున్నారు. ఇక వరంగల్ ఉప ఎన్నిక కోసమే నామినేటెడ్ పోస్టులు వాయిదా వేసినట్లు కేసీఆర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా వరంగల్ ఉప ఎన్నికలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.