‘ఎర్ర’ కలకలం
⇒ ఎర్రచందనం కేసులో రావల్కోల్ వాసి మాధవరెడ్డి అరెస్టు
⇒ జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన
⇒ తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు
⇒ రూ.100 కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు
మేడ్చల్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడైన మేడ్చల్ మండలం రావల్‌కోల్‌కు చెందిన గూడూరు మాధవరెడ్డి పోలీసులను శుక్రవారం అరెస్టు చేయడం జిల్లాలో కలకలం రేపింది.
నెల్లూరు జిల్లాలో ఎర్రచందనం కేసులో మాధవరెడ్డి నిందితుడు. రూ.100 కోట్ల విలువైన దాదాపు 80 టన్నుల ఎర్రచందనాన్ని మాధవరెడ్డి స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం తెల్లవారుజూమున రావల్‌కోల్‌లోని ఆయన ఇంటిపై ఆ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ సీతారామయ్య, ఆత్మకూరు సీఐ ఖాజావలీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడి చేశారు. మాధవరెడ్డిని, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డిని, టెంపో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మాధవరెడ్డి అరెస్టు విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి చెప్పారు. మాధవరెడ్డి ఎక్కడికెళ్లాడు.. గురువారం రాత్రి అసలేం జరిగిందనే విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మిని విచారించగా.. తనకు ఛాతిలో నొప్పిగా ఉందని, ఏమీ మాట్లాడలేనని చెప్పినట్లు సీఐ తెలిపారు.
నేరచరిత్ర గల మాధవరెడ్డి..
మాధవరెడ్డి మేడ్చల్ మండలంలో ఆది నుంచీ వివాదాస్పద వ్యక్తి. ఎవరిపై పడితే వారిపై చేయిచేసుకోవడం, దురుసుగా మాట్లాడటం ఆయన స్వభావం. దీంతో పదేళ్ల క్రితం మేడ్చల్ పోలీసులు ఆయనను రౌడీషీటర్‌గా నమోదు చేశారు. ఓ మహిళ కేసులో, మద్యం అక్రమ రవాణా విషయంలో జిల్లాలోని తాండూరు, చేవెళ్ల పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఏడేళ్ల క్రితం మాధవరెడ్డిని అరెస్ట్ చేయడానికి రావల్కోల్ గ్రామానికి వచ్చిన చేవెళ్ల పోలీసులను ఆయనతోపాటు కుటుంబసభ్యులు రాళ్లతో దాడి చేసి గాయపర్చారు.
ఇటీవల ఆయన కాంగ్రెస్‌లో చురుకైన నాయకుడిగా ఎదిగాడు. చిల్లర కేసుల్లో ఉండే మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలియడంతో స్థానికులు విస్తుపోతున్నారు.
కొన్నాళ్లుగా మాధవరెడ్డిపై నిఘా
శేషాచలం అడువుల నుంచి దుంగలను హైదరాబాద్ శివార్లలో డంపుచేసి అక్కడి నుంచి సాధారణ కలపగా చూపి గుజరాత్, ముంబాయికి తరలించి పోర్టుల ద్వారా ఇతర దేశాలకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాధవరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో దాడిచేసి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు బురిడీ..
శంషాబాద్‌లో గురువారం జరిగిన తన తమ్ముడి కుమారుడి వివాహం జరగ్గా దానికి హాజరై వస్తున్న మాధవరెడ్డిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలివిగా వ్యవహరించిన మాధవరెడ్డి.. తలను కారుకు కొట్టుకుని అరవడంతో పలువురు జమయ్యారు. దీంతో పోలీసులు నిందితుడికి విషయం తెలిస్తే ఇకముందు కూడా దొరకడని భావించి వదిలేసి వెళ్లారు. కాగా తనపై దుండగులు దాడి చేసి గాయపర్చారని మాధవరెడ్డి అదే రాత్రి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, మాధవరెడ్డికి ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపారు.
గురువారం రాత్రి మాధవరెడ్డి సృష్టించిన వీరంగంపై కడప జిల్లా పోలీసులు శుక్రవారం ఉదయం మేడ్చల్ పోలీసులకు సమాచారమందించారు. మాధవరెడ్డి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నిందితుడని.. ఆయనపై కేసు నమోదు చేయాలని చెప్పడంతో మేడ్చల్ పోలీసులు అవాక్కయ్యారు. రాత్రంతా హంగామా చేసిన వ్యక్తి స్మగ్లింగ్ కేసులో నిందుతుడా..? అంటూ మేడ్చల్ పోలీసులు బిత్తరపోయారు. మాధవరెడ్డిపై కేసు నమోదు చేశారు.