ఐక్యరాజ్య సినిమా గుల్ మకాయ్
అవును చిత్రమే! ఉగ్రవాదంపై ఒక పదహారేళ్ల అమ్మాయిఉగ్రురాలవడం చిత్రమే! బందూకు చూపినా మారాకు వణకకపోతే అది చిత్రమే!‘నీ ఆలోచన కరెక్టు కాదు’ అనిమెదడులోకి బుల్లెట్ దింపినా..ఆలోచన ఆగకపోతే అది చిత్రమే!ఆ అమ్మాయి బయోపిక్నిఐరాస సెలబ్రేట్ చెయ్యడం చిత్రమే.
గుర్తు కోసం చెప్పడమిది.
ఇవాళ శుక్రవారం కదా. వచ్చే శుక్రవారం.. జనవరి 25న లండన్‌లో 450 మంది అత్యున్నతస్థాయి అధికార ప్రతినిధులు కలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నుంచి కొందరు, దేశాలన్నిటినీ కలుపుకుపోయే ‘ఈమ్శామ్’ అనే ఒక సంస్థ ఉంది.. ఆ సంస్థ నుంచి కొందరు, ఇంకా.. ఇండో–పాక్ దౌత్యవేత్తలు, బ్రిటన్ హై కమిషన్ నుంచి కొందరు వస్తున్నారు. వీళ్లతో పాటు మరో ముగ్గురు ముఖ్యులు.. లండన్‌లో ఫ్లయిట్ దిగుతారు. ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, ఐక్యరాజ్యసమితి ఒకచోట కలుస్తున్నాయంటే.. కచ్చితంగా అది చిన్న సంగతైతే కాదు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఇలా జరుగుతుంది. తాలిబాన్! అఫ్గానిస్తాన్‌లో యుద్ధం (జిహాద్) చేస్తున్న ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు నిద్రాణంలో ఉంది. నిద్రాణంలో ఉందంటే నిద్రపోతోందని కాదు. ఏ క్షణమైనా నిద్రలేవొచ్చని. ‘దాని ముఖం.
లేచి ఏం చేస్తుంది?’ అని లోకల్ కుర్రాళ్లకు ధైర్యం చెప్పి, తుపాకుల్ని భుజానికెత్తుకుని అమెరికా సైన్యం ఈమధ్యే అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందక్కడ. అక్కడే కాదు. పాకిస్తాన్లో, భారత్‌లో కూడా! అఫ్గాన్ బార్డర్లో ఇప్పుడు రోజూ ఉదయాన్నే పక్షులు స్వేచ్ఛగా సూర్యస్నానాలు చేసి, మధ్యాహ్నమంతా దొరికిందేదో తిని, సాయంకాల విన్యాసాలు చేస్తున్నాయి. నేలపై మసి బొగ్గుల్లేవు. నింగిలో అగ్ర విమానాల గగ్గోలు లేదు. రెండేళ్ల క్రితం వరకు ఈ మూడు దేశాల్లో (పాక్, ఇండియా, అఫ్గానిస్తాన్) ఇంత ప్రశాంతత లేదు. ఆరేళ్ల క్రితమైతే.. ప్రశాంతత అనే మాటకు అర్థమే లేదు. పాకిస్తాన్ అందర్నీ ఒణికిస్తుంది కదా, పాకిస్తానే వణికిపోతున్న టైమ్ అది.. తాలిబాన్ల దెబ్బకి! మొహమ్మద్ ఒమర్ వర్తమానం అందిందంటే.. ‘పోస్ట్’ అంటూ ఆత్మాహుతి బాంబు డోర్ దగ్గర డెలివరీ అయినట్లే.
తీసుకుని ఎక్కడ పడేయాలి దాన్ని. ఎంత పాక్ అయితే మాత్రం ఎన్నాళ్లని ఆ బాంబుని నెత్తిమీదే పెట్టుకుని తనని తను కాపాడుకుంటుంది. ఇక ముల్లా అఖ్తర్ మన్సూర్ పాక్‌లోకి దిగాడంటే.. అధ్యక్ష భవనంలో ఆ పూట కార్యక్రమాలు క్రమం తప్పాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ ముల్లా. తర్వాతే ఆహార పానీయాలు. ఇండియాక్కూడా తిండీ నీళ్లు దక్కని రోజులున్నాయి. కనీసం టాయ్‌లెట్‌కి వెళ్లనివ్వలేదు తాలిబాన్లు. ఇండియన్ ఫ్లయిట్‌ను హైజాక్ చేసి (1999), వారం రోజులు ఎటూ కదలనివ్వలేదు. ఇప్పుడు ఒమర్, మన్సూర్ ఇద్దరూ లేరు. ఒమర్‌ని టీబీ తీసుకుపోయిందని పాక్ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ రాసింది. రెండేళ్ల వరకు ఒమర్ చనిపోయిన సంగతే ప్రపంచానికి తెలియకుండా షో నడిపింది తాలిబాన్! మన్సూర్‌ను అమెరికన్ సైనికులు ఎయిర్ స్ట్రైక్‌లో చంపేశారు. తాలిబాన్‌కు ఇప్పుడు ఇద్దరే నాయకులు మిగిలారు.
వాళ్లు ‘మిగిలిన నాయకులు’ మాత్రమే. నాయకులు కాదు. ఒమన్, మన్సూర్.. చనిపోయేవరకూ ఎవర్నీ బతకనివ్వలేదు. పాక్‌ని చెప్పు చేతల్లో ఉంచుకున్నారు. పాక్ చేత పనులన్నీ చెప్పి చేయించుకున్నారు. గవర్నమెంట్ పాకిస్తాన్‌దే. పాకిస్తాన్ ఏ డ్రెస్ వేసుకోవాలన్నది, ఇండియాతో పాక్ ఎంతసేపు మాట్లాడాలన్నది డిసైడ్ చేసేది మాత్రం ఒమర్, మన్సూర్. ఇద్దరూ అంత పవర్ఫుల్. ఆ పవర్‌తో వాళ్లు సరిపెట్టుకుని ఉంటే బాగుండేది. అమ్మాయిల జోలికి వచ్చారు! జోలికి రావడం అంటే అసభ్యంగా ఏమీ బిహేవ్ చెయ్యలేదు. ‘స్కూల్లేదు ఏం లేదు. ఇంట్లో ఉండండి’ అని ఆజ్ఞ జారీ చేశారు. ‘ఆడపిల్లలు స్కూల్బ్యాగుతో రోడ్డు మీద కనిపిస్తే కాల్చిపారేస్తాం’’ అని శాంపిల్‌గా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అదే వారి చావుకొచ్చింది. ఎక్కడో జరిపిన ఆ కాల్పుల చప్పుడు పాకిస్తాన్‌లోని ‘స్వాత్’ లోయలో ప్రతిధ్వనించింది.
ఆ లోయలోని ఒక ఇంట్లో శ్రద్ధగా పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఓ పదిహేనేళ్ల బాలికను ఆ కాల్పులు డిస్టర్బ్ చేశాయి. ‘‘ఏంటి నాన్నా ఇది?’’ అంది.‘‘వాళ్లంతే’’ అన్నాడు తండ్రి. ‘‘స్కూల్‌కి వెళితే చంపేయడం ఏంటి నాన్నా’’ అంది.‘‘వాళ్లంతేనమ్మా’’ అన్నాడు తండ్రి. త్వరగా తెల్లారితే బాగుండనుకుంది ఆ బాలిక.. స్కూలుకు వెళ్లడం కోసం! తెల్లారింది. తయారై స్కూలుకు బయల్దేరింది. స్కూలుకు వెళ్లి, పరీక్ష రాసి, బస్‌లో వస్తుంటే.. తాలిఫాన్లు ఆ అమ్మాయి మీద, ఇంకో అమ్మాయి మీద కాల్పులు జరిపారు. రెండో అమ్మాయి తప్పించుకుంది. ఈ అమ్మాయికి తలలో బులెట్ దిగింది. కోమాలోకి వెళ్లిపోయింది. తాలిబాన్లు ఆ బాలిక తలలోకి బులెట్ దిగబడిందనే అనుకున్నారు కానీ, ఆ బాలికే బుల్లెట్లా మారి, తమ ఆధిపత్యపు కణతల్లో దిగబడుతుందని ఊహించలేదు. వారం తర్వాత ఆ బాలిక కోమాలోంచి బయటికి వచ్చింది.
మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. తిరిగి స్కూల్‌కి బయల్దేరింది!తాలిబాన్లకు తొలి చావు అది. చావంటే ప్రాణం పోవడం మాత్రమే కాదు. ఆజ్ఞ ధిక్కారం జరగడం కూడా. ఆ బాలిక తాలిబాన్లను ‘గుల్ మకాయ్’ అనే పేరుతో స్మూత్‌గా ఒక్కో పోటూ పొడవడం మొదలు పెట్టింది. బీబీసీలో గుల్ మకాయ్. బ్లాగుల్లో గుల్ మకాయ్. ‘‘గుల్ మకాయ్ ఎవరు?’’ .. తాలిబాన్ ఆరా తీసింది. ‘‘భాయ్.. అది పెన్ నేమ్’’ అన్నారు అనుచరులు. ‘‘అసలు పేరేంటి?’’‘‘మలాలా. మలాలా యూసాఫ్జాయ్’’.గుర్తు చేయడం కోసం చెప్పడమిది. వచ్చే శుక్రవారం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది లండన్‌లో కలుస్తున్నారు. వాళ్లు వస్తున్నది సదస్సుకోసం, సమావేశం కోసం కాదు. సినిమా చూడ్డం కోసం. ఆ సినిమా పేరు.. ‘గుల్ మకాయ్’. మలాలా బయోపిక్! దర్శకుడు అమ్జాద్ ఖాన్.
నిర్మాతలు సంజ్సింఘ్లా, ప్రీతీ వియల్ లాలూ. స్క్రీన్ ప్లే భస్వాతి చక్రవర్తి. వీళ్లందరికన్నా పెద్ద పేరు రీమ్ షేక్. మలాలా పాత్రలో నటిస్తున్నది ఈ అమ్మాయే. చిన్న పిల్లపై బయోపిక్ ఏంటి? చిన్న పిల్ల పాత్రను పోషిస్తున్న మరో చిన్న పిల్ల రీమ్ షేక్ పేరు పెద్ద పేరు ఎలా అవుతుంది? మలాలా ఎఫెక్ట్ ఇది. చిన్న వయసులోనే కదా తను అంత పెద్ద తాలిబాన్లకు ఎదురు తిరిగింది. చిన్న వయసులోనే కదా అంత పెద్ద నోబెల్ బహుమతి పొందింది. చిన్న వయసులోనే కదా మూడు ఇన్స్పైరింగ్ బుక్స్ (ఐయామ్ మలాలా, మలాలాస్ మ్యాజిక్ పెన్సిల్, ఉయ్ ఆర్ డిస్ప్లేస్డ్) రాసింది. ‘గుల్ మకాయ్’లో మలాలా తండ్రి జియావుద్దీన్‌గా అతుల్ కులకర్ణి, మలాలా తల్లిగా దివ్యాదత్త నటిస్తున్నారు.
గత ఏడాది జనవరిలో చనిపోయిన విలక్షణ నటుడు ఓమ్ పురి ఈ చిత్రంలో జనరల్ కయానీగా నటించారు. ఇవన్నీ సాధారణ విషయాలు. అసాధారణం ఏంటంటే.. ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ఒక సినిమాకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ ఈవెంట్ ఇది! ‘ఈమ్శామ్’తో (పౌష్టికాహార నివారణకు కృషి చేస్తున్న ఖండాంతర ప్రభుత్వాల సంస్థ) కలిసి, ఐరాస మళ్లీ ఫిబ్రవరి మధ్యలో న్యూయార్క్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ‘గుల్ మకాయ్’ని ప్రదర్శించబోతోంది. మరి మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతుంది? ఏప్రిల్‌లో. ఎగ్జామ్స్ తర్వాత. అన్నట్లు లండన్‌లో పెద్దపెద్ద వాళ్లతో కలిసి ‘గుల్ మకాయ్’ సినిమాను చూడబోతున్న ఆ ముగ్గురూ ఎవరు? మలాలా ప్లస్ ఆమె తల్లిదండ్రులు.
రీల్ మలాలా.. రీమ్ షేక్
బయోపిక్‌లు తీసేవాళ్ల అదృష్టం ఏంటంటే.. రియల్ లైఫ్ పాత్రలకు తగిన పోలికలున్న రీల్ లైఫ్ నటులు దొరకడం. ‘గుల్ మకాయ్’లో మలాలా పాత్రకు అచ్చుగుద్దినట్లుగా కాకపోయినా, ఇంచుమించు ఆ అమ్మాయిలానే ఉన్న రీమ్ షేక్ అనే అమ్మాయి దొరికింది. మలాలా జీవితం 16వ యేట మొదలైంది కాబట్టి ఈ పదహారేళ్ల అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం తను జీటీవీలో వస్తున్న ‘తుర్nుసే హై రాబ్తా’లో కల్యాణి దేశ్‌ముఖ్ అనే పాత్రలో నటిస్తోంది.
రీమ్ పుట్టింది ముంబైలో. ఆరవ యేటలోనే నటనలోకి వచ్చింది. టీవీ సీరియళ్లలో ఇప్పటికే ఆమెది ఎనిమిదేళ్ల కెరీర్! 13 సీరియళ్లలో నటించింది. 2016లో బెజోయ్ నంబియార్ ‘వజీర్’ సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసింది. రెండు అవార్డులు వచ్చాయి. ఒక అవార్డుకు నామినేట్ అయింది. రియల్ లైఫ్‌లో మలాలా పోషిస్తున్న పెద్ద పాత్ర లానే, రీల్ లైఫ్‌లో రీమా తన వంతు పాత్రలో గుర్తింపు తెచ్చుకుంటోంది.