పాకిస్తాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుల్ మకాయ్’ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అంజద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలాలా పాత్రలో బాలీవుడ్ నటి రీమ్ షేక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా థీమ్‌ను తెలియజేసేలా ఈ ఫస్ట్‌లుక్‌ను రూపొందించారు. మలాల చేతిలో పుస్తకం పట్టుకొని ఉండగా.. పుస్తకాన్ని ఉగ్రవాదులు తగలబెట్టినట్లుగా పోస్టర్‌లో చూపించారు. తాలిబన్ల అరాచకాలకు ముస్లీం బాలికలు ఎలా చదువుకు దూరమయ్యారనే విషయాన్ని ఫస్ట్ లుక్‌లో చూపించారు. ఈ సినిమాలో మలాలా తల్లి పాత్రను దివ్య దత్తా పోషిస్తున్నారు. అలాగే ఇందులో ఓం పురి, రాగిణి ఖన్నాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మలాల తన చిన్ననాటి అనుభవాలను ‘గుల్ మకాయ్’ అనే పేరుతో డైరీ రూపంలో రాసుకున్నారు. ఉర్దూలో రాసుకున్న ఈ పుస్తకానికి సంబంధించిన కథనం బీబీసీలో ప్రసారం చేశారు. ఇప్పుడు అదే పేరుతో మలాల బయోపిక్ తెరకెక్కనుంది. గతంలో మలాల, తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ‘ఐయామ్ మలాలా’ అన్న పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు.
పాకిస్తాన్, స్వాత్‌లోయలో బాలికల చదువుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినా, 11 ఏళ్ల వయస్సులోనే మలాలా విద్యా హక్కు కోసం పోరాటం చేశారు. 2012 లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల విద్యకోసం మలాలా కృషిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment