gulbarg society massacre
-
గుల్బర్గ్ సొసైటీ కేసు:తీర్పు శుక్రవారానికి వాయిదా
న్యూఢిల్లీ: గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. న్యాయస్థానం తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కోర్టు జడ్జి పీబీ దేశాయ్ 66 మంది నిందితుల్లో 24 మందిని దోషులుగా తేల్చారు. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది. దీనివెనక కుట్ర లేదని స్పష్టం చేసింది. నిందితుల్లో ఐదుగురు మరణించగా ఒకరి ఆచూకీ లేకుండా పోయింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. gulbarg society massacre,verdict, quantum of punishment,గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ, తీర్పు వాయిదా, దోషులు -
గుజరాత్ అల్లర్ల కేసులో కీలక తీర్పు
గుజరాత్లో సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 24 మందిని అహ్మదాబాద్ కోర్టు దోషులుగా తేల్చింది. మరో 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. నాలుగుసార్లు బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన కీలక నిందితుడు బిపిన్ పటేల్‌ను కూడా ఈ కేసులో నిర్దోషిగా విడిచిపెట్టారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజున గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో ఒక వర్గం లక్ష్యంగా దాడులు జరిగాయి సుమారు 20 వేల మంది ఆ ప్రాంతంపై దాడి చేశారు. దాంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. అప్పట్లో జరిగిన అల్లర్లలో దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టారు. ఎహసాన్ జాఫ్రీ లాంటివాళ్లను ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి మరీ నరికేసి, తగలబెట్టారు. పోలీసులకు, సీనియర్ నాయకులకు సాయం కోసం ఫోన్లు చేసినా ఎవరూ అప్పట్లో ఆ ఫోన్లు ఆన్సర్ చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశారు. వారిలో బీజేపీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు. ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ (77) ఈ కేసులో న్యాయం చేయాలంటూ ఇన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ, ఇతర మంత్రుల పాత్ర కూడా ఈ అల్లర్లలో ఉందని ఆమె ఆరోపించారు. దిగువకోర్టు వారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్లగా, సిట్ ఆధ్వర్యంలోనే కేసు దర్యాప్తు జరగాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. బాధితులను సజీవ దహనం చేశారనడానికి అక్కడ లభించిన 39 మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని సిట్ కోర్టులో తెలిపింది. పెట్రోలు క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా సంఘటన స్థలంలో ఉన్నాయని, దాన్నిబట్టి అక్కడ భారీస్థాయిలో మారణహోమం జరిగిందని చెప్పింది. చివరకు ఈ ఘటన జరిగిన సుమారు 15 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈ ఘటనపై తీర్పు వెల్లడించింది.