గుజరాత్ అల్లర్ల కేసులో కీలక తీర్పు | gulbarg society massacre case, 36 acquitted by ahmedabad court | Sakshi
Sakshi News home page

గుజరాత్ అల్లర్ల కేసులో కీలక తీర్పు

Published Thu, Jun 2 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

gulbarg society massacre case, 36 acquitted by ahmedabad court

గుజరాత్‌లో సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 24 మందిని అహ్మదాబాద్ కోర్టు దోషులుగా తేల్చింది. మరో 36 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. నాలుగుసార్లు బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన కీలక నిందితుడు బిపిన్ పటేల్‌ను కూడా ఈ కేసులో నిర్దోషిగా విడిచిపెట్టారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజున గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో ఒక వర్గం లక్ష్యంగా దాడులు జరిగాయి సుమారు 20 వేల మంది ఆ ప్రాంతంపై దాడి చేశారు. దాంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. అప్పట్లో జరిగిన అల్లర్లలో దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టారు. ఎహసాన్ జాఫ్రీ లాంటివాళ్లను ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి మరీ నరికేసి, తగలబెట్టారు. పోలీసులకు, సీనియర్ నాయకులకు సాయం కోసం ఫోన్లు చేసినా ఎవరూ అప్పట్లో ఆ ఫోన్లు ఆన్సర్ చేయలేదన్న ఆరోపణలున్నాయి.

ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశారు. వారిలో బీజేపీ కార్పొరేటర్ బిపిన్ పటేల్ ఒకరు. ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ (77) ఈ కేసులో న్యాయం చేయాలంటూ ఇన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ, ఇతర మంత్రుల పాత్ర కూడా ఈ అల్లర్లలో ఉందని ఆమె ఆరోపించారు. దిగువకోర్టు వారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్లగా, సిట్ ఆధ్వర్యంలోనే కేసు దర్యాప్తు జరగాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. బాధితులను సజీవ దహనం చేశారనడానికి అక్కడ లభించిన 39 మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని సిట్ కోర్టులో తెలిపింది. పెట్రోలు క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా సంఘటన స్థలంలో ఉన్నాయని, దాన్నిబట్టి అక్కడ భారీస్థాయిలో మారణహోమం జరిగిందని చెప్పింది. చివరకు ఈ ఘటన జరిగిన సుమారు 15 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఈ ఘటనపై తీర్పు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement