కాస్త స్టైల్ మార్చాల్సిందే!
క్రైమ్ షోలన్నీ ఒకే తరహాలో సాగుతుంటాయి. జరిగిన సంఘటనను వీడియో రూపంలో చూపిస్తుంటారు. వివరాలను మధ్య మధ్యన హోస్ట్ వచ్చి వివరిస్తుంటాడు. స్క్రీన్‌ప్లే ఎంత ముఖ్యమో, యాంకరింగ్ పార్ట్ కూడా అంతే ముఖ్యం ఇలాంటి షోలకి. అయితే వీ చానెల్లో వచ్చే ‘గుమ్రాహ్’ క్రైమ్ షోలో ఏదైనా మైనస్ ఉందంటే అది కచ్చితంగా యాంకరింగ్ పార్టే!
యూత్ చేసిన నేరాల ఆధారంగా ‘ద ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్’ ట్యాగ్‌లైన్‌తో నిర్వహిస్తున్నారు ఈ షోని. స్క్రీన్‌ప్లే బాగుంటుంది. కానీ కరణ్ కుంద్రా యాంకరింగ్ మాత్రం మరీ నీరసంగా సాగుతుంది. వినిపించీ వినిపించకుండా, అర్థమయ్యీ కానట్టుగా, గొణుగుతున్నట్టుగా ఉంటుందతడి యాంకరింగ్. అంతకన్నా విసిగించే విషయం ఏమిటంటే... అతడు క్రైమ్సీన్లోకి చొచ్చుకొస్తూ ఉంటాడు. మిగతా క్రైమ్ షోలలో యాంకర్లు తెర మీదికి రాగానే కాస్త రిలీఫ్ ఫీలవుతాం. కానీ గుమ్రాహ్లో కరణ్ రాగానే కన్ఫ్యూజ్ అవుతాం. కొత్తగా షో చూస్తున్నవాళ్లయితే అది కూడా స్టోరీలో భాగమేమో అని పొరపాటు పడతారు. కరణ్ యాంకరింగ్ స్టయిల్‌తో పాటు, అతడి సన్నివేశాలను తీసే విధానం కూడా మార్చాల్సిందే. లేదంటే క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా లాంటి షోలతో గుమ్రాహ్ని పోల్చి కూడా చూడలేరు ప్రేక్షకులు!