చిరస్మరణీయుడు ‘గురజాడ’
సాక్షిప్రతినిధి,విజయనగరం: మహాకవి గురజాడ వేంకటఅప్పారావు 159వ జయంతి కార్యక్రమాలు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన విజయనగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు సురేష్‌బాబు, పాకలపాటి రఘువర్మ, ఎస్పీ ఎం.దీపికలు పాల్గొని మహాకవికి నివాళులర్పించారు. తొలుత గురజాడ స్వగృహంలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పిచారు.
అనంతరం ఇంటి ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గురజాడ వాడిన కళ్లద్దాలు, రబ్బరు స్టాంపును గురజాడ కుటుంబీకులు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, ఇందిరలు పట్టుకుని గురజాడ స్వగహం నుంచి గురజాడ అప్పారావు జంక్షన్ వద్ద ఉన్న గురజాడ విగ్రహం వరకూ దేశభక్తి గేయాన్ని ఆలపిస్తూ ర్యాలీగా వెళ్లారు. అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు గురజాడ స్ఫూర్తిని కొనియాడారు. పాఠశాలల్లో మహాకవి దేశభక్తి గేయాన్ని ప్రార్థనా గీతంగా మార్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు.
పువ్వాడ వెంకటేష్‌కు ఉత్తమ కవితా పురస్కార ప్రదానం
సాయంత్రం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో గురజాడ సాంస్కృతిక సమాఖ్య, నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) సంస్థలు సంయుక్తంగా బెంగళూరుకు చెందిన పువ్వాడ వెంకటేష్‌కు ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రదానం చేశాయి. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి కాపుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.