నల్గొండ జిల్లాలో భారీ వర్షం: వాగులో చిక్కుకున్న రెండు లారీలు
నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైనాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలు అన్నింటికి జిల్లా కలెక్టర్ శుక్రవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా హాలియా సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
అయితే ఆ వాగు నీటిలో రెండు లారీలు చిక్కుకున్నాయి. అందులోని డ్రైవర్, క్లీనర్లు లారీలపైకి ఎక్కి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వాగులో నీరు ఉధృతంగా ప్రవహించడంతో హాలియా- దేవరకొండల మధ్య రాకపోకలు నిచిపోయాయి.
అలాగే భారీ వర్షాల కారణంగా మూసి నదిలో నీరు శుక్రవారం ఉదయం 643 అడుగుల గరిష్టస్థాయికి చేరుకుంది. దాంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేసి, దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. వీటితోపాటు గురుజాల వాగులో కూడా నీటి ప్రవాహాం మహా ఉధృతంగా ఉంది. దాంతో 12 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకారాల్లో పంట నష్టం సంభవించింది.