సెంచరీతో చెలరేగిన గురురాఘవేంద్ర
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆర్డీటీ అనంతపురం జట్టు తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు టీ–20లు, మూడు వన్డేల్లో విజయం సాధించింది. స్థానిక అనంత క్రీడా గ్రామంలో ఆర్డీటీ అనంతపురం, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన 5వ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అనంత జట్టు ఓపెనర్ గురురాఘవేంద్ర సెంచరీతో కదం తొక్కి జట్టుకు విజయాన్నందించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.
జట్టులో షార్ప్ 41, , జోన్స్ 41, మాంటెగ్యూ 33 పరుగులు చేశారు. అనంత జట్టులో హాషిం 2, హరినాథ్, గురు రాఘవేంద్ర, రోహిత్ రోషన్, వెంకటరమణలు చెరో వికెట్ సాధించారు. అనంతరం అనంతపురం జట్టు 32.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. జట్టు ఓపెనర్ గురురాఘవేంద్ర 100 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 103 పరుగులు సాధించాడు. హరినాథ్ 61, అర్జున్ టెండూల్కర్ 17 పరుగులతో అజేయంగా నిలిచారు. న్యూజిలాండ్, ఆర్డీటీ అనంతపురం జట్ట క్రికెట్ టోర్నీ గురువారంతో ముగుస్తుందని ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ తెలిపారు.