లెజెండ్’లో అంతరాయం అభిమానుల విధ్వంసం
స్క్రీన్ చింపివేత, కుర్చీలు ధ్వంసం
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్: సినిమా ప్రదర్శనలో అంతరాయం చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు విరగ్గొట్టి, స్క్రీన్ చించి వేసి విధ్వంసం సృష్టించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని గురునాథ్ థియేటర్లో లెజెండ్ చిత్రం ప్రదర్శిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మ్యాట్నీ ప్రదర్శిస్తుండగా, సాంకేతిక లోపం కారణంగా స్క్రీన్‌పై చిత్రం అదృశ్యమైంది. అర గంట గడిచినా చిత్ర ప్రదర్శన తిరిగి ప్రారంభం కాకపోవడంతో బాలకృష్ణ అభిమానులు థియేటర్ నిర్వాహకులతో వాదనకు దిగారు.
వారు నచ్చజెప్పినా వినకుండా కుర్చీలను విరగ్గొట్టారు. హాలు బయట ఉన్న లైట్లు, క్యాంటీన్ అద్దాలు పగులగొట్టారు. కూల్డ్రింకు బాటిళ్లను థియేటర్లోకి విసిరారు. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు స్క్రీన్‌ను కొద్దిగా చించివేశారు.
పరిస్థితి అదుపు తప్పడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని అభిమానులను చెదరగొట్టారు. థియేటర్లో వేసిన ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయాయి. రూ. లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు క్యాంటిన్ యజమాని కుమార్ తెలిపారు. గొడవకు కారణమైన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.