ఎక్స్‌పోజింగ్‌కు నో
వర్ధమాన తారలలో తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచుకుని విజయానికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతున్న నటి శ్రీదివ్య. పదహారణాల అచ్చ తెలుగు ఆడపడుచైన ఈ ముద్దుగుమ్మ బస్టాప్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని వరుత్త పడాద వాలిభర్ సంఘం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడ కూడా తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే కోలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటికిక్కడ మంచి డిమాండే ఉంది. సక్సెస్‌తో పాటు తన హోమ్లీ లుక్ కూడా ఇందుకు కారణం కావచ్చు.
ప్రస్తుతం శ్రీ దివ్య చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. మరికొన్ని అవకాశాలు ఎదురుచూస్తున్నాయట. అలాగే ఈ అమ్మడు యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ సరసన నటిస్తున్న పెన్సిల్, అధర్వతో రొమాన్స్ చేస్తున్న ఈటి, శివకార్తికేయన్‌తో మరోసారి జత కడుతోంది, నటుడు విష్ణు, జీవా చిత్రాలతో పాటు విక్రమ్ ప్రభు సరసన నటిస్తున్న శ్రీ దివ్య ఏం చెబుతోందంటే.. ప్రస్తుతం తమిళంలో ఐదు చిత్రాల్లో నటిస్తున్నాను. వీటిలో ఈటి, జీవా చిత్రాల్లో కళాశాల యువతిగాను, పెన్సిల్ చిత్రంలో పాఠశాల అమ్మాయిగాను నటిస్తున్నారు. అయితే ఈమూడు పాత్రలు ఒక్కొక్కటి ఒక్కో కోణంలో సాగుతాయి. ఈటి చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఇక జీవా చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగుతుంది. అలాగే తానా చిత్రంలో నర్సు పాత్రలో కనిపిస్తాను. రిపీట్ పాత్రల్లో నటించాలనుకోవడం లేదు.
అలాగే చెట్లు పుట్టలు తిరుగుతూ పాటలకే పరిమితమయ్యే పాత్రలను అంగీకరించను. అది టాప్ హీరోల చిత్రాలైనా నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను. పాత్ర నచ్చితే నూతన దర్శకత్వంలో అయినా నటించడానికి రెడీ. పెన్సిల్ చిత్రంలో నటించడానికి ప్రధాన కారణం ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్ కథాంశంతో సాగే కథా చిత్రం. అదే విధంగా సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్‌కు నేను వీరాభిమాని. ఆయన పాటలంటే చాలా ఇష్టం. అలాంటిది ఆయన సరసన నటించడం ఆనందంగా ఉంది. నటుడు శివకార్తికేయన్‌ది చాలా ఫ్రెండ్లీ నేచర్. వరుత్త పడాద వాలిభన్ చిత్రంలో ఆయన సహకారం మరువలేనిది. నటుడు విక్రమ్ ప్రభులో గొప్ప నట వంశం నుంచి వచ్చాననే గర్వం కించిత్ కూడా ఉండదు. ఇక నటుడు అధర్వతో పెద్ద పరిచయం లేదు. ఆయనతో కలసి రెండు రోజులే నటించినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో నటించడానికి ఒక్క భాష మినహా తారతమ్యం లేదు. అలాగే మణిరత్నం, గౌతమ్ మీనన్, తెలుగు దర్శకుడు కె.విశ్వనాథ్ చిత్రాల్లో నటించాలని ఆశ. మౌనరాగం, అలప్పాయిదే, వారణం ఆయిరం, ఎందిరన్ తదితర నాకు నచ్చిన చిత్రాల్లో కొన్ని. ప్రస్తుతం ఉన్న హోమ్లీ ఇమేజ్‌నే కోరుకుంటున్నాను. గ్లామరస్ పాత్రలు జోలికి పోదలచుకోలేదు. అందాలారబోత అవకాశాలంటే సారీ చెప్పేస్తానని శ్రీ దివ్య అంటున్నారు.