గ్యాదరి మధ్యంతర అప్లికేషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కు హైకోర్టు షాకిచ్చింది. తన ఎన్నిక చెల్లదంటూ ఇదే నియోజకవర్గ కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఎమ్మెల్యే దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో సాక్షుల తుదిజాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ సెపె్టంబర్ 4కు వాయిదా వేసింది.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్యాదరి కిశోర్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కిశోర్ విజయం సాధించారు. అయితే కిశోర్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, పోలైన ఓట్లకు, ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కల్లో తేడాలున్నాయని పేర్కొంటూ దయాకర్ 2019లో హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. కిశోర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని రద్దు చేసి, తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ ప్రధాన పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉండగా, తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను కొట్టివేయాలంటూ కిశోర్ మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, కిశోర్ తరఫు వాదనలను తోసిపుచ్చారు. ప్రధాన పిటిషన్ విచారణార్హమైనదేనని స్పష్టం చేశారు. సాక్షుల జాబితాను ఫైనల్ చేయాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు.