యూపీఏ విధానాలే ఐతే ఎన్డీయే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: యూపీఏ విధానాలు, నిర్ణయాలే అమలవుతున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, దీని కోసం ఎన్డీయే ప్రభుత్వం ఎందుకని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం టీఆర్‌ఎస్ నేత పి.రాజేశ్వర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్నారని బీజేపీ, ఎన్డీయే నాయకులు తప్పించుకోవడం సరైందికాదన్నారు.
యూపీఏ నిర్ణయాలనే ఎన్డీయే అమలు చేయాలనుకుంటే యూపీఏ-3 అని పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేక పచ్చచొక్కా వేసుకున్న పిచ్చికుక్కలాగా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దళితుల సంక్షేమానికి కేసీఆర్ బృహత్తర నిర్ణయం తీసుకున్నారని, దళితులకు గతంలో ఎవరూ చేయని మేలును చేస్తున్నారని చెప్పారు.
దళితులకు టీడీపీ ఏం చేస్తున్నది?: ఎమ్మెల్యే గువ్వల
దళితుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ ఏమీ చేయడం లేదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. దళితులకు తెలంగాణ ప్రభుత్వమే అండగా ఉన్నదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం భూపంపిణీ చేస్తున్నదని బాలరాజు చెప్పారు. ఏపీలో టీడీపీ ఏం చేస్తున్నదో చెప్పాలన్నారు