భార్యను వేరేవారితో చూసి భరించలేక..!
పుణె: అనుమానంతో వైద్యురాలైన తన భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అనంతరం కారులో పారిపోతుండగా ఒక్క గంటలోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ పటిదార్(40) అంజలి పటిదార్(34) అనే ఇద్దరు భార్య భర్తలు. అతడు పుణెలోని హింజేవాడికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా అంజలి గైనాకాలజిస్ట్ గా పనిచేస్తోంది. వీరికి ఓ నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాకడ్ చౌక్ లోని ఆశీర్వాద్ రెగెన్సీ భవనంలో వీరు కాపురం ఉంటున్నారు. అందులోనే ఓ విభాగంలో అంజలి క్లినిక్ నడుపుతోంది.
అయితే, బుధవారం రాత్రి ఇంటికొచ్చిన మనోజ్ పిల్లాడు ఇంట్లో నిద్రిస్తుండగా.. సోఫాలో కూర్చుని భార్యతో మాట్లాడుతూ అనూహ్యంగా తుపాకీ తీసి కణతకు పెట్టి కాల్చాడు. ఆమె రక్తపు మడుగులోనే పడిఉండగా తన కారు తీసుకొని పరారు అయ్యాడు. తన భార్యను గాయపరిచానని తల్లికి ఫోన్ చేసి చెప్పగా ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో అతడిని గంటలోనే అదుపులోకి తీసుకున్నారు. అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇటీవల తన భార్యను వేరే వారితో ఉండటం మనోజ్ చూశాడని, అది భరించలేక ఆమెను హత్య చేశాడని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంజలి అతడికి మూడో భార్య. అంతకు ముందు చేసుకున్న ఇద్దరు భార్యలు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.