కశ్మీరీల ప్రజాస్వామిక విశ్వాసం
1996 తర్వాత జమ్ము–కశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైంది. సమస్యాత్మక ప్రాంతంలో ఇది కొత్త శకానికి నాంది అనుకోవచ్చు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగం ప్రకారం ఉన్న పరిమిత రాజకీయ స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కశ్మీరీలు, లద్ధాఖ్ వాసుల సంకల్పానికి ఈ పోలింగ్ శాతం ఒక సూచన. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై కోపం ఉన్నప్పటికీ, భారతదేశంపై కొత్త విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. రాజకీయ, సామాజిక సమస్యలకు పరిష్కారాలను తీసుకురాగల సామర్థ్యం తుపాకీ కంటే ప్రజాస్వామిక ప్రక్రియే కలిగి ఉందని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు చూపిస్తున్నారు.మునుపటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. నివేదికల ప్రకారం, పరిణామంలో చిన్నదైనప్పటికీ ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో, 1996 తర్వాత అత్యధికంగా ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లోనే నమోదయ్యింది. శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ జరగగా, బారాముల్లాలో 59.1 శాతం నమోదైంది. జమ్మూ డివిజన్ లోని పూంచ్–రాజౌరీ జిల్లాల చేరిక వల్ల కశ్మీరీల ప్రాబల్యం తగ్గిపోయిన అనంత్‌నాగ్‌లో 54.84 శాతం ఓటింగ్ నమోదైంది.కొత్త శకానికి నాందిముస్లిం మెజారిటీ ప్రాంతాలైన కశ్మీర్, లద్ధాఖ్; హిందూ మెజారిటీ ఉన్న జమ్మూ మధ్య ఎన్నికల ఫలితాలు తీవ్రమైన మతపర విభజనను వెల్లడిస్తున్నాయి. పీర్ పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న పోటీదారులు ఓటర్లకు చేసిన మతపరమైన విజ్ఞప్తి ద్వారా కూడా ఈ విభజన ధ్రువీకరించబడింది. కశ్మీర్ లోయ వేర్పాటువాదం నుంచి బయటపడినప్పటికీ... జమ్మూలో రెండు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ హిందుత్వ ఎజెండా (నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ద్వారా మతపరమైన అస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి రూపొందించిన నియోజకవర్గాలివి) లోయలోని ప్రతి అభ్యర్థికి చెందిన విభిన్నమైన మతపరమైన ప్రాతిపదికతో సరిపోలింది. వాస్తవానికి, కశ్మీర్‌లోని షియా ముస్లిం సమాజపు మొదటి కుటుంబానికి చెంది, శ్రీనగర్ నుండి గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఆగా సయ్యద్ రుహుల్లా తన కమ్యూనిటీ తరపున కశ్మీరీ పండితులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ద్వారా అంతకుముందటి స్థితిని బద్దలుకొట్టారు. 1990–96 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్ ఇప్పటిలాగే కేంద్ర పాలనలో ఉన్నప్పుడు, కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండితుల భారీ వలసలను నిరోధించడంలో విఫలమైనందుకు ఆయన క్షమాపణ వేడుకున్నారు.అలాంటప్పుడు సమస్యాత్మక ప్రాంతంలో ఇది కొత్త శకానికి నాంది కాదా? 2019లో ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఉన్న పరిమిత రాజకీయ స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించిన తర్వాత, ఇవి జమ్మూ కశ్మీర్లో జరిగిన మొదటి ఎన్నికలని గుర్తుంచుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కశ్మీరీలు, లద్ధాఖ్ వాసుల సంకల్పానికి లోయలో, లద్ధాఖ్‌లో నమోదైన పోలింగ్ శాతం ఒక సూచన. స్వతంత్ర అభ్యర్థిగా లద్ధాఖ్ సీటును గెలుచుకున్న మాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహమ్మద్ హనీఫాకు మొదటి నుండీ ట్రెండ్స్ అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇది ఆ పార్టీ పునరుజ్జీవనం కాదు. కేంద్రంలోని అధికార పార్టీని ఓడించడానికి దాని వెనుక సమీకరించే ప్రయత్నం. ఎందుకంటే నేషనల్ కాన్పరెన్స్ స్టార్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి ఓడిపోయారు. అబ్దుల్లాకు 26 శాతం ఓట్లు రాగా, ఆయన మీద గెలిచిన ఇంజనీర్ రషీద్‌కు దాదాపు 46 శాతం ఓట్లు పోలయ్యాయి. ‘స్వతంత్ర కశ్మీర్’ను ప్రవచించే రషీద్ అదే కారణంగా ‘ఉపా’ కేసులో గత ఐదేళ్లుగా తిహార్ జైలులో ఉన్నారు. చివరి క్షణంలో ఆయన ఇద్దరు కుమారుల నేతృత్వంలో ప్రచారం ఊపందుకుంది.ఆర్టికల్ 370 రద్దుకు కారణమైన బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఓట్ల ఏకీకరణకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాము. ఇంతకుముందు, కశ్మీర్లో పాతుకుపోయిన రెండు ప్రముఖ పార్టీలు ఎన్ సీ, పీడీపీలు బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చివరిగా కశ్మీర్లో ఏర్పాటైన ప్రభుత్వం బీజేపీ, పీడీపీ కూటమి. ప్రతి ఒక్కరి ఎన్నికల ప్రచారాల ద్వారా వ్యక్తీకరించబడినట్లుగా, సజ్జాద్ లోన్ కు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్ వంటి బీజేపీ మిత్రపక్షాలు కూడా ప్రజల మద్దతు కోసం ఏదైనా విజ్ఞప్తి చేయడానికి ముందు, ఆ పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది.పునరావిష్కరించుకుంటేనే కమల వికాసంకశ్మీర్లోని ఏ స్థానం నుంచి కూడా బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కశ్మీర్లో కమలం వికసించడానికి సమయం పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ కశ్మీరీల కోసం, లద్ధాఖ్ ప్రజల కోసం పార్టీ తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటే తప్ప, ఇది అసంభవమని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రధానమంత్రులుగా జమ్ము కశ్మీర్ చూసిన భారతీయ నాయకులందరిలోకీ అటల్ బిహారీ వాజ్‌పేయి అత్యంత ప్రియమైన వ్యక్తి.బీజేపీకి మద్దతివ్వడం పక్కన పెడితే, ఆ పార్టీతో అనుబంధం పెట్టుకోవడానికి కూడా శ్రీనగర్‌లో ఎవరూ లేరు. నేను మే మొదటి వారంలో లోయలో ఉన్నాను. డౌన్ టౌన్ తో సహా శ్రీనగర్‌లోని స్నేహితుల ఇళ్లలోనూ, సోపోర్‌లోనూ ఉన్నాను. ఒమర్ అబ్దుల్లాను సవాలు చేసే వ్యక్తిగా ఇంజనీర్ రషీద్ ఆవిర్భవించడం అప్పటికి ఇంకా స్పష్టీకరించబడలేదు. కానీ బీజేపీ పట్ల వ్యతిరేకత మాత్రం అక్కడ స్పష్టంగా, సార్వత్రికంగా ఉంది.ప్రచారంలో అభ్యర్థులు ఒకరి కంటే ఒకరు బీజేపీకి వ్యతిరేకంగానే ఎక్కువగా తమ గురించి చెప్పుకున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కశ్మీర్ రాజకీయ రంగంలోని వివిధ వర్గాలు ఏకమయ్యాయి. కశ్మీరీలు ఇచ్చిన సందేశం బిగ్గరగా, స్పష్టంగా ఉంది. ఎన్నికల క్రమంలో కుల్గామ్, పూంఛ్‌లలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో వాస్తవంగా హింస తగ్గుముఖం పట్టిందనే దృక్పథాన్నే నేను కొనసాగించాలనుకుంటున్నాను. బీజేపీ మీద వ్యతిరేకతకు కారణాలు ఏవంటే, ప్రస్తుతం ఉన్న పరిపాలన ప్రజలలో ఏ విధమైన సంతృప్తిని కలిగించకపోగా, పరాయీకరణను పెంచింది.తుపాకీ కన్నా ఓటు మేలుఅయినప్పటికీ, అదే సమయంలో, కశ్మీర్‌ను నాలాగే అభిమానిస్తున్న వారికి ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంది. అక్కడ పరాయీకరణ ఉన్నప్పటికీ, రాజకీయ, సామాజిక సమస్యలకు పరిష్కారాలను తీసుకురాగల సామర్థ్యం తుపాకీ కంటే ప్రజాస్వామిక ప్రక్రియే కలిగి ఉందని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు చూపిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై కోపం ఉన్నప్పటికీ, భారతదేశంపై కొత్త విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. ఓటు రూపంలో దేశం దాని ప్రజలకు ఇచ్చిన భరోసా కూడా కశ్మీరీల్లో వ్యక్తమైంది.ఈ ప్రాంతంలోని రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల ప్రతినిధులు, కశ్మీరీలే అయినప్పటికీ ప్రజల తిరస్కరణను ఎదుర్కొన్నారు. కానీ 1990ల నుండి గ్రహణం పట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంకా సజీవంగానూ, చైతన్యవంతంగానూ ఉంది. ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలనే ప్రజల విశ్వాసంలో, ఇతర భారతీయులకు లాగే దేశ పాలనలో తామూ భాగం కాగలమనే గుర్తింపునకు సంబంధించిన వ్యక్తీకరణలో ఇది కనబడుతోంది.వజాహత్ హబీబుల్లా వ్యాసకర్త జమ్ము కశ్మీర్ క్యాడర్ మాజీ ఉన్నతాధికారి; ‘నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్’ మాజీ చైర్పర్సన్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)