haicourt stay
-
ఆ పదకొండు..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేగుంట నగరపంచాయతీలో విలీనం చేసిన పదకొండు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కొంత మంది నాయకులు నగరపంచాయతీని కొనసాగించాలని, మరికొందరు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నిర్ణయంపై కోర్టు స్టేటస్కో ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ దఫా ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లను ప్రకటించింది. మూడో విడతలో ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై కోర్టు ఏం తీర్పు ప్రకటిస్తోందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సాక్షి, మెదక్: చేగుంట మండలంలోని పదకొండు పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది. గత పంచాయతీ ఎన్నికలకు దూరమైన ఈ గ్రామాల్లో ఈ దఫా అయినా ఎన్నికలు జరుగుతాయా? అన్న అంశం రాజకీయవర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. చేగుంట నగర పంచాయతీ ఏర్పాటు కోసం సమీపంలోని పది గ్రామాలను విలీనం చేసిన విషయం తెలిసిందే. చేగుంట నగర పంచాయతీ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఆ పదకొండుగ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించారు. అలాగే మూడో విడతలో ఈ ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్లో పేర్కొన్నారు. అయితే తాజాగా చేగుంట నగర పంచాయతీగా కొనసాగించాలని కోరుతూ స్థానిక నాయకుడు మరోమారు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని స్థానికులు, సర్పంచ్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2013లో ఈ గ్రామాల్లో గ్రామసభల తీర్మానాలతో చేగుంట పరిసర గ్రామాలను కలుపుకొని నగరపంచాయతీగా ఏర్పాటు చేశారు. అదే ఏడాది జులైలో నగరపంచాయతీ పరిపాలన ప్రారంభించగా చేగుంట, రెడ్డిపల్లి, వల్లూర్, చిట్టోజిపల్లి, రుక్మాపూర్, ఉల్లితిమ్మాయిపల్లి, అనంతసాగర్, కర్నాల్‌పల్లి, చిన్నశివునూర్, వడియారం, పొలంపల్లి గ్రామాలు నగరపంచాయతీ పరిధిలోకి వచ్చాయి. నగరపంచాయతీ పరిపాలన కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. హైకోర్టు స్టేటస్కో.. తెలంగాణ ఏర్పాటు అనంతరం చేగుంట, రెడ్డిపల్లి, వడియారం గ్రామాల ప్రజలు నగరపంచాయతీని రద్దు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే స్థానిక నాయకులు 12 మంది మాత్రం చేగుంట నగర పంచాయతీని కొనసాగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. 2015 ఫిబ్రవరి 23న ఈ నగర పంచాయతీపై హైకోర్టు స్టేటస్కో విధించింది. తుదితీర్పు వెలువడే వరకు నగరపంచాయతీ పరిధిలోని గ్రామాలను ప్రత్యేక అధికారులను నియమించి పాలన జరపాలని సూచించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 11 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల కోసం చేగుంటతోపాటు 10 విలీన గ్రామాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ప్రకటించారు. తాజాగా చేగుంటకు చెందిన స్థానిక నాయకులు మరోమారు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. గురు, శుక్రవారాల్లో కోర్టు సెలవు ఉందని శనివారం నగరపంచాయతీ అంశంపై విచారణ చేసే అవకాశం ఉందని స్థానిక నాయకుడు గణేశ్ తెలిపారు. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి హనోక్ వివరణ కోరగా నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయటంతోపాటు ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ ప్రకటించామన్నారు. స్టేటస్కో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, 11 పంచాయతీల ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు సూచనకు అనుగుణంగా నడుచుకోవటం జరుగుతుందన్నారు. -
పల్లె పోరు సాధ్యమేనా..!
ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా..? హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్తే ఎన్నికలకు నిర్వహించాల్సిందేనని ఆదేశించవచ్చా..? ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల సీజన్ చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వíహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పల్లె పోరుకు సంబంధించి ఈసీ ఎలాంటి సమాచారం అందినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా సమాయత్తం అవుతోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జిల్లా యంత్రాంగం డిసెంబర్లో జరగనున్న సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. సమీక్షలు, సమావేశాలు, శిక్షణలు, ఓటరు యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహనలు కల్పించడంలో తీరిక లేకుండా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వచ్చే నెల 12న నోటిఫికేషన్, డిసెం బర్ 7న పోలింగ్ చేపట్టాలని సీఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11న ఓట్ల లెక్కిం పు చేపట్టనున్నారు. ఈ లెక్కన ఇప్పటి నుంచే లెక్కేసుకున్నా.. 2019 జనవరి 11లోగా గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు పూర్తి కావాలి. అంటే నెలలో పల్లెపోరును నిర్వహించడం సాధ్యమేనా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్వహణకు ఈసీ నుంచి ఆదేశాలు వస్తే ఒకేసారి అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. అంతాసిద్ధం.. ప్రభుత్వం గత మే, జూన్ మాసాల్లో పంచాయతీల ఎన్నికల నిర్వహణకు హడావుడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు నెలల క్రితమే ఎన్నికల నిర్వహణకు అన్ని సిద్ధం చేశారు. జిల్లాలో పాత 243 గ్రామ పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. అప్పటి పోరులో గెలిచిన వారు సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టి ఈ యేడాది ఆగస్టు ఒకటో తేదీతో ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా మరో 226 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అన్ని కలుపుకొని ప్రస్తుతం జిల్లాలో పంచాయతీల సంఖ్య 467కు చేరింది. ఈ పంచాయతీల పరిధిలో 3,822 వార్డులు ఉన్నాయి. పంచాయతీలతోపాటు వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు గత జూలైలో అధికారులు అన్ని సిద్ధం చేశారు. 4 వేలకుపైగా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయగా, పోలింగ్ కేంద్రాలనూ గుర్తించారు. ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్ బాక్సులు మనవద్ద అందుబాటులో లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి పోరుకు సిద్ధంగా ఉంచారు. గత జూలైలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 3,36,647 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,68,741 మంది ఉండగా, 1,67,825 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 81 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు సిద్ధం చేసిన ఓటరు జాబితాలో స్పష్టంగా ఉంది. జైనథ్ మండలంలో అత్యధికంగా 33,577 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా మావలలో 3,370 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే ఇప్పుడా సంఖ్య కొంత పెరిగింది. ఇదిలా ఉండగా, జిల్లాలోని బజార్హత్నూర్, భీంపూర్, బోథ్, గాదిగూడ, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు, తాంసి మండలాల్లో పంచాయతీ ఓటర్లు పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండడం గమనార్హం. వరుస ఎన్నికలేనా..? మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్ని కల నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తే వరుసగా ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. ఈ యేడాది డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, జనవరిలో గ్రామ పంచాయతీలకు జరుగుతాయి. పార్లమెంట్ సభ్యుల పదవీ కాలం కూడా వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో పూర్తి కానుండడంతో అప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించి 2019 ఆగస్టుతో ఐదేళ్లు పూర్తి కానుంది. అంతకు ముందే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీలకు కూడా 2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలు జరిగాయి. అంటే అవి కూడా నిర్వహించక తప్పదు. దీనిని బట్టి చూస్తే ఇప్పటి నుంచి యేడాదంతా ఎన్నికల సందడి మొదలు కానుందనడంలో సందేహం లేదు. పంచాయతీ పోరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యంత్రాంగానికి, ఎన్నికల సిబ్బందికి కొంత ఊరట కలిగే అవకాశాలున్నాయి. యంత్రానికి పరీక్షే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నుంచి ఆదేశాలు వస్తే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల నిర్వహణ ఓ సవాలుగా మారనుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో నోడల్ అధికారులూ నియామకం అమయ్యారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ వేగవంతం కానుంది. మరో పక్కా ప్రభుత్వం ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఆయా ప్రభుత్వ అధికారులకు స్థాన చలనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాపై అవగాహన కలిగిన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లనుండడంతో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి పరీక్షగా మారే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. -
ఆ ఇళ్ల జోలికెళ్లొద్దు
తాడేపల్లి (తాడేపల్లిరూరల్): ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి పేదలకు అండగా ఉండాలని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. స్థానిక కేఎల్‌రావుకాలనీ, అమరారెడ్డినగర్ ప్రాంతాల్లో ఇళ్ల తొలగింపుపై ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. గతంలో తాడేపల్లి మునిసిపాలిటీలో 500 ఇళ్లు తొలగించకుండా కోర్టు స్టేటస్కో విధించింది. తాజాగా మరో 370 ఇళ్ల జోలికి వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన స్టేటస్–కో విషయమై ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ప్రాంతంలో కారు దిగినందుకే పేదల ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, రాజధాని మొత్తం తిరిగితే గ్రామాలన్నీ తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల విజయోత్సవం.. ఇళ్లు తొలగించొద్దంటూ కోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై కేఎల్‌రావు కాలనీ, అమరారెడ్డినగర్‌వాసులు గురువారం తమ కాలనీల్లో వైఎస్సార్ సీపీ నాయకులు కేళి వెంకటేశ్వరరావు, ముదిగొండ ప్రకాష్, మేకా వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. స్థానిక నాయకులను కృతజ్ఞతలు చెప్పుకున్నారు.