ఆ ఇళ్ల జోలికెళ్లొద్దు
తాడేపల్లి (తాడేపల్లిరూరల్): ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి పేదలకు అండగా ఉండాలని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. స్థానిక కేఎల్‌రావుకాలనీ, అమరారెడ్డినగర్ ప్రాంతాల్లో ఇళ్ల తొలగింపుపై ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. గతంలో తాడేపల్లి మునిసిపాలిటీలో 500 ఇళ్లు తొలగించకుండా కోర్టు స్టేటస్‌కో విధించింది. తాజాగా మరో 370 ఇళ్ల జోలికి వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన స్టేటస్–కో విషయమై ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఒక్కసారి ఈ ప్రాంతంలో కారు దిగినందుకే పేదల ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారని, రాజధాని మొత్తం తిరిగితే గ్రామాలన్నీ తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికుల విజయోత్సవం..
ఇళ్లు తొలగించొద్దంటూ కోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై కేఎల్‌రావు కాలనీ, అమరారెడ్డినగర్‌వాసులు గురువారం తమ కాలనీల్లో వైఎస్సార్ సీపీ నాయకులు కేళి వెంకటేశ్వరరావు, ముదిగొండ ప్రకాష్, మేకా వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. స్థానిక నాయకులను కృతజ్ఞతలు చెప్పుకున్నారు.