Cyclone Yaas: ముంచుకొస్తున్న తుపాన్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది. అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం ఇది.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర దిశలో 560 కి.మీ దూరంలో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 26వ తేదీ ఉదయం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి.. పారాదీప్ – సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.
తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో టెక్కలి, పాతపట్నం, పమిడిలో 4 సెంమీ, కళింగపట్నం, వీరఘట్టం, యలమంచిలి, కైకలూరు, నర్సీపట్నం, భీమవరం, విజయనగరంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది.
భారీగా సహాయక సామాగ్రి సిద్ధం
► భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. భారత వాయుదళం (ఎయిర్‌ఫోర్స్) 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌కు పంపించారు.
► 15 ఎయిర్క్రాఫ్టŠస్ ద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు పంపించారు. మరో 16 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, 26 హెలికాఫ్టర్లను సహాయక చర్యల కోసం పశ్చిమ తీరంలో సిద్ధంగా ఉంచారు.
► తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన భువనేశ్వర్, కోల్‌కతాకు 10, పోర్ట్‌బ్లెయిర్‌కు 5 విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు.
► విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నుంచి రెస్క్యూ బృందాలతో నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. కోవిడ్ నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది.
అదనపు ఆక్సిజన్ నిల్వలు సిద్ధం
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం యాస్ తుపానుగా తీవ్రరూపు దాల్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న మూడు ప్లాంట్లతోపాటు అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
► ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రెండు రోజులుగా ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నాం. తద్వారా అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బఫర్ నిల్వలు ఉండేట్టుగా చూస్తున్నాం.
►ఇప్పటికే ఒడిశాలోని రూర్కెలా నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించింది. సోమవారం నాటికి మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు రైలు ద్వారా రానున్నాయి.
► రూర్కెలా, కళింగ నగర్, అంగూల్ నుంచి రోడ్డు మార్గంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సవ్యంగా తీసుకువచ్చేందుకు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం.
►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ తెప్పించిన 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆదివారం విశాఖపట్నం పోర్ట్ వద్ద ప్రభుత్వానికి అందించింది.
►రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేసింది.
► తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
►సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.