మరో నాలుగు రోజులు వడగళ్ల వాన
- నగరంలో ఈదురుగాలుల బీభత్సం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓ వైపు మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వడగాడ్పులు కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం హన్మకొండలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో అనేక చోట్ల వడగళ్లు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా దోమకొండలో 4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా ధర్మసాగర్, శాయంపేట, కొత్తగూడెంలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. బుధవారం హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్లారెడ్డిగూడలో ఓ దుకాణంపై భారీ వృక్షం విరిగిపడటంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన ఎండవేడిమిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సేదతీరారు. రాష్ర్టంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బతో మొత్తం 48 మంది మృత్యువాత పడ్డారు.
ఖమ్మం జిల్లాలో ఐదుగురు, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో 8 మంది మరణించారు. పాలమూరు జిల్లాలో ఆరుగురు, నల్లగొండ జిల్లాలో 14 మంది, మెదక్ జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చనిపోయారు.
ఈదురు గాలులు.. వడగండ్లు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు, ఆ తర్వాత కురిసిన వడగండ్ల వానతో మార్కెట్ యూర్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసిపోరుుంది. పలుచోట్ల పిడుగులు పడటంతో ఐదుగురు వ్యక్తులతోపాటు, పదుల సంఖ్యలో పశువులు మృతి చెందారుు. గాలికి ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో ఆస్తినష్టం సంభవించింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.
ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
హన్మకొండ 43.6
రామగుండం 43.0
ఆదిలాబాద్ 42.3
నిజామాబాద్ 41.9
ఖమ్మం 41.8
ప్రాంతం ఉష్ణోగ్రత
మెదక్ 41.0
భద్రాచలం 40.6
హైదరాబాద్ 40.6
మహబూబ్‌నగర్ 40.3
నల్లగొండ 40.2