Aanchal Morwan: సిగ ధగ నైపుణ్యం
ఒత్తయిన తలకట్టుతోనే అందం, ఆకర్షణ! ఆరోగ్యకరమైన జుట్టుంటే ఎన్ని సోకులైనా పోవచ్చు!అలా సెలబ్రిటీల హెయిర్‌ని హెల్దీగా ఉంచుతూ .. ఆన్‌స్క్రీన్ పాత్రలకు తగ్గట్టు, ఆఫ్ స్క్రీన్ వేడుకలకు సూట్ అయ్యేట్టు కేశాలను అలంకరిస్తూ, తారల మీద నుంచి తల తిప్పుకోనివ్వకుండా చేసేది హెయిర్ స్టయిలిస్ట్లే! ఆ లిస్ట్‌లో.. బాలీవుడ్ జపించే పేరు ఆంచల్ మోర్వానీ!ఇన్‌స్టా హ్యాండిల్ ‘హాట్ హెయిర్ బెలూన్’తో ప్రసిద్ధి!జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కృతి సనన్, దీపికా పదుకోణ్, తృప్తి డిమ్రీ, నోరా ఫతే, కియారా ఆడ్వాణీ, సుహానా ఖాన్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, డయానా పెంటీ, శనాయా కపూర్, దిశా పాట్నీ, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్నా, మిథిలా పాల్కర్, యామీ గౌతమ్, అమలా పాల్, చిత్రాంగదా సింగ్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా, స్వరా భాస్కర్, రియా కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో! ఆమె చేతికి జుట్టిచ్చి.. అందాన్ని తురుముకునే సెలబ్రిటీలు! నటీమణులే కాదు మోడల్స్ కూడా ఆంచల్ చేత జుట్టు ముడిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. సిల్వర్ స్క్రీన్, ర్యాంప్‌ల మీదే కాదు ఫొటో షూట్స్, రెడ్ కార్పెట్ వాక్స్, సినిమా ఈవెంట్స్, పార్టీలకూ ఆంచల్ చేసిన హెయిర్ స్టయిల్‌తోనే హాజరవుతుంటారు. సినిమా లోకానికి అవతల కూడా ఆంచల్ హెయిర్ స్టయిలింగ్కి అశేష అభిమానగణం ఉంది. పండుగలు, బర్త్‌డేలు, పెళ్లిళ్లు, పురుళ్లు ఇలా ప్రతి సందర్భానికీ ఆమె హెయిర్ స్టయిల్ని కోరుకునేవారున్నారు. ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముంబై వాసి ఈ రంగంలోకి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..‘నాకు చిన్నప్పటి నుంచీ రకరకాల జడలు వేయడమన్నా, వేయించుకోవడమన్నా చాలా ఇష్టం. క్లాస్‌లో నా ముందు కూర్చున్న ఫ్రెండ్స్‌కి జడలు వేసి టీచర్‌తో తిట్లు తినేదాన్ని. ఇంట్లో కూడా అమ్మ, నానమ్మ, అత్త, పిన్ని, కజిన్స్.. అందరినీ రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో ముస్తాబు చేసేదాన్ని. నా ఈ కళకు మా అమ్మ తెగ మురిసిపోయేది. హెయిర్ స్టయిల్స్లోనే కాదు కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌లో కూడా ఫస్ట్ ఉండేదాన్ని. అయితే హెయిర్ స్టయిలిస్ట్‌ను అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాన్నో కెరీర్‌గా తీసుకుంటారనీ తెలియదప్పుడు. అందుకే ఏంబీఏ అయిపోగానే ఒక అడ్వర్టయిజ్మెంట్ కంపెనీలో చేరాను. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో మిస్ అవుతున్న భావన. దాన్ని వదిలేసి మా సొంత సంస్థలో కొంతకాలం మార్కెటింగ్ జాబ్ చేశాను. అదీ నచ్చలేదు. క్రియేటివ్ వర్క్ మీదకే పోయేది మనసు. అప్పుడు గ్రహించాను హెయిర్ స్టయిలింగే నా కాలింగ్ అని. దాని మీద రీసర్చ్ చేస్తే తెలిసింది దానికోసం స్పెషల్ కోర్సులున్నాయని. అంతే పేరెంట్స్‌కి చెప్పి లండన్ వెళ్లాను. అక్కడ Vida Sassoon Academyలో చేరాను. దాని తర్వాత అక్కడే స్టయిలింగ్కి సంబంధించే మరో రెండు కోర్సులు చేసి, ఇండియా వచ్చేశా. ఈ రంగంలో అవకాశాలైతే కనపడ్డాయి కానీ మొదట్లో కొంత స్ట్రగుల్ తప్పలేదు. భయపడలేదు. నా విద్యనే నమ్ముకున్నాను. వమ్ము చేయలేదు. ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. నచ్చిన పని ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు’ అని చెబుతుంది ఆంచల్. బాలీవుడ్లో పనిచేస్తూనే, ‘హాట్ హెయిర్ బెలూన్’ పేరుతో ఇన్‌స్టాలో జుట్టు సంరక్షణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది. హెయిర్ కేర్ ట్యుటోరియల్స్ కూడా నిర్వహిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో ఆమెకు అసంఖ్యాకమైన ఫాలోయింగ్ ఉంది. ‘మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దానికి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. అది మన సృజనను సానబెడుతుంది’ అంటూ ఔత్సాహిక హెయిర్ స్టయిలిస్ట్లకు సలహా ఇస్తుంది ఆంచల్ మోర్వానీ.