కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్‌గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..
జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్‌గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్‌లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్‌కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.
కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది కూడా.
(చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!)
Comments
Please login to add a commentAdd a comment