ఇల్లు అమ్మనివ్వలేదని..
నెల్లూరు(క్రైమ్): ఇల్లు అమ్మనివ్వలేదన్న అక్కసుతో భార్యను ఓ భర్త కడతేర్చిన సంఘటన నెల్లూరు డైకస్‌రోడ్డు సెంటర్లోని ఎన్సీసీ కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు ఎన్సీసీ కాలనీకి చెందిన మహబూబ్‌జానీకి బిట్రగుంటకు చెందిన ఎస్కే హమీద్జాని (45)తో 25 ఏళ్ల కిందట వివాహమైంది. మహబూబ్‌జానీ మంచం అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి రషీద్, నవీద్, సల్మాన్, ఇస్మాయిల్ పిల్లలు. పెద్ద కుమారుడు రషీద్‌కు వివాహమైంది. అందరూ ఎన్సీసీ కాలనీలో నివాసముంటున్నారు.
మహబూబ్‌జానీ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో పాటు కొట్టేవాడు. ఇటీవల అప్పులిచ్చిన వారు మహబూబ్జాన్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎన్సీసీ కాలనీ మూడో వీధిలో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మివేసి అప్పులు కట్టేందుకు ఆయన సిద్ధపడ్డాడు. అందుకు భార్య అంగీకరించకపోవడంతో ఘర్షణ జరుగుతోంది. మంగళవారం రాత్రి మహబూబ్‌జాన్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అతను ఓ గదిలో , హమీద్జాన్ తన పిల్లలతో కలిసి మరో గది లో నిద్రించారు.
అర్ధరాత్రి తాగేందుకు మంచినీళ్లు కావాలని భార్యను లేపాడు. ఆమె నీరు తీసుకుని గదిలోకి వెళ్లగా మహబూబ్ వెంటనే తలుపులు వేసి ఎలాగైనా ఇల్లు అమ్మివేస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. మహబూబ్ కత్తితో భార్యను కడుపు, ఛాతి, వీపుపై బలంగా పొడిచాడు. ఆమె కేకలు వేయగా పక్కగదిలో నిద్రిస్తున్న కుమారులు గదిని తెరిచేందుకు యత్నించారు. రాకపోవడంతో సిమెంట్ కిటికీని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. నిందితుడు పరారయ్యాడు.
తల్లిని కుమారులు రామచంద్రారెడ్డి వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందన్నారు. దీంతో బాధితులు ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర సీఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.