Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం.