షిర్డీలో గదుల అద్దె తగ్గింపు
జనవరి ఒకటినుంచి అమలులోకి
సాక్షి, ముంబై: సాయిబాబా భక్తులకు శుభవార్త. భక్తి నివాస్ ప్రాంగణంలోని గదుల అద్దెను సగానికి తగ్గించాలని షిర్డీ సాయిబాబా సంస్థాన్ యాజమాన్యం నిర్ణయించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దీనిని అమలు చేస్తామని సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే చెప్పారు. ప్రస్తుతం భక్తి నివాస్ భవనంలో సాధారణ గదికి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం జనవరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేస్తారు. అదేవిధంగా ఏసీ గదులకు రోజుకు రూ.900 వసూలు చేస్తుండగా, జనవరి నుంచి రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఓ సాయి భక్తుడు అందజేసిన విరాళాలతో నిర్మించిన సాయిఆశ్రం ప్రాజెక్టులో ఒక్కొక్క గదిలో మూడు పడకలు ఉన్నాయి. ఇటువంటి వి మొత్తం 1,536 గదులు ఉన్నాయి.
హారతి కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వద్ద నుంచి వసూలు చేస్తున్న రుసుమును సంస్థాన్ ఇటీవల రద్దు చేసిన సంగతి విదితమే. దీంతో హారతి సమయంలో సాధారణ భక్తుల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ సంస్థాన్ బాబా దర్శనంకోసం వచ్చే భక్తులతో వ్యాపారం చేస్త్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు గదుల అద్దె తగ్గించాలని సంస్థాన్ నిర్ణయించింది. ఇదిలాఉంచితే బాబా సమాధి చుట్టూ అద్దాలను ఏర్పాటు చేయాలని సంస్థాన్ యోచిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశ నలుమూలలనుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు షిర్డీకి వెళతారు.