క్రికెట్లో బాల్ తగిలి బాలుడి మృతి
హైదరాబాద్‌లో ఘటన.. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
హైదరాబాద్: క్రికెట్ ఆడుతున్న బాలుడికి ప్రమాదవశాత్తు హార్డ్ టెన్నిస్ బాల్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒంగోలుకు చెందిన గోవిందరాజులు, అనిత మన్సూరాబాద్ సహారా స్టేట్స్‌కాలనీలో నివసిస్తున్నారు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి వంశీకృష్ణ (6) స్థానిక నాగార్జున పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.
గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వంశీకృష్ణ మిత్రులు భవదీప్, సాయిచంద్ర, కార్తీక్, ప్రణయ్, విజయ్‌లతో కలసి గంగాధార్ బ్లాక్ పార్కింగ్ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారు.విజయ్ కొట్టిన బాల్ వంశీకృష్ణ ఛాతీకి తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న వంశీకృష్ణ తల్లిదండ్రులు బాలుడుని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందాడని తెలిపారు. అది విన్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వంశీకృష్ణ చదువులోనే కాకుండా అన్ని పనులను తెలివిగా, చురుకుగా చేస్తుంటాడని, ఇలా జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా వంశీకృష్ణ మృతి వార్త తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించింది. వసస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.