హరితవనంతోనే బంగారు తెలంగాణ
మొక్కలను పిల్లల్లా పెంచాలి
అడవుల శాతం పెరగడానికి కృషి చేయాలి
ఎస్పీ అంబర్ కిశోర్ ఝా
పరకాల : హరితవనంతోనే బంగారు తెలంగాణకు బాటలు పడతాయని జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పోలీసు అమరవీరుల స్మారకార్థం మంగళవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయన్నారు. నాటిన మొక్కలను చిన్న పిల్లల మాదిరిగా పెంచితే తర్వాత అవి పండ్లు ఇస్తాయన్నారు. మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం నెలకు కొంత మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. 33 శాతం ఉన్న అడవుల శాతాన్ని 50 శాతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరకాల డీఎస్పీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్మారకార్థం మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సబ్ డివిజన్లో లక్ష మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, తహసీల్దార్ పి.హరికృష్ణ, ములుగు ఫారెస్ట్ రేంజర్ పూర్ణిమ, ఎస్సైలు దీపక్, రవీందర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.