hat-trick Record
-
హ్యాట్రిక్‌కు గ్యారంటీ
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన హ్యాట్రిక్ విజయం.. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్‌కు గ్యారంటీ అని ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ఘన విజయం తర్వాత ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ వందలాది మంది పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ మూడు రాష్ట్రాల్లో కలిపి హ్యాట్రిక్ సాధించాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్ గెలుపునకు ఈరోజు విజయం గ్యారంటీని ఇస్తోంది. ఇది చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార ‘ఇండియా’ కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భరత, పారదర్శక, సుపరిపాలన భారత్‌ను కాంక్షించే బీజేపీ ఎజెండాకు ఈ గెలుపు మద్దతుగా నిలిచింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా గతంలో విపక్షాల అగ్రనేతలు గ్రూప్ ఫొటో దిగటాన్ని మోదీ ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు. ‘‘ స్టేజీ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు చేరితే మంచి ఫొటోలు దిగగలరు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుపొందలేరు. ఈ ఫలితాలు కాంగ్రెస్, దాని గర్విష్ఠి కూటమికి పెద్ద గుణపాఠం నేర్పాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల నమ్మకాన్ని పెంచుతోంది మోదీ సర్కార్ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తెచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులను బనాయిస్తోందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను మోదీ ప్రస్తావించారు. ‘ అవినీతికి వ్యతి రేకంగా మేం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఈ ఫలితాల రూపంలో మాకు మద్దతు పలికారు. అవినీతిలో మునిగిన పారీ్టలకు ఓటర్లు ఈ ఫలితాల రూపంలో వారి్నంగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజలకు మధ్య మరెవరూ రాలేరు. ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కనపడేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాజకీయాలు చేయొద్దు. దేశాన్ని విభజించే, విచి్ఛన్నం చేసే శక్తులతో జట్టుకట్టొద్దు’’ అని హితవు పలికారు. ‘‘ఇలాంటి సందర్భాల్లో దేశ వ్యతిరేక శక్తులు ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి. అదను కోసం ఎదురుచూస్తుంటాయి. ఇలాంటి వారితో జాగ్రత్త’ అంటూ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. ‘ఈ గెలుపు భారత్‌పై ప్రపంచదేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఇది భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ‘అభివృద్ధి చెందిన భారత్’ సాకారం కోసం మనం చేపడుతున్న ఎజెండాకు ప్రజా మద్దతుకు లభిస్తోందని ఈ ఫలితాలు చాటుతున్నాయి. దేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారన్న విషయాన్ని ప్రపంచదేశాలు కళ్లారా చూశాయి’’ అని మోదీ అన్నారు. ఈ భూతాలను బీజేపీయే తరిమికొట్టగలదు ‘అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలనే ఈ మూడు భూతాలను తరిమికొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్ భారతదేశమే భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలకు ఇది సూటి హెచ్చరిక. అవినీతిపరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వాళ్లొకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజా మద్దతు ఉందని ఈ ఎన్నికల ఫలితాలను చూసైనా ఈ వ్యక్తులు అర్ధం చేసుకోవాలి’’ అని విపక్షాలను పరోక్షంగా విమర్శించారు. ఆ కులాల సాధికారత దేశ సాధికారత ‘‘దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని దేశంలో నాలుగే పెద్ద కులాలున్నాయి. ఈ కులాలు సాధికారత సాధించిననాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగల వారంతా ఈ నాలుగు వర్గాల్లోనే ఉన్నారు. బీజేపీ తమ విధాన నిర్ణయాలు, పథకాల ద్వారా వీరి సాధికారతకు కృషిచేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచామని ప్రతి ఒక్క రైతు, యువజన ఓటరు, పేద, అణగారిన వర్గాల వ్యక్తులు గొంతెత్తి నినదిస్తున్నారు. గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈ రోజు ఫలితాలు చూశాక 2027కల్లా అభివృద్ధిచెందిన భారత్ సాకారం అవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాగా ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకుపోతూ దేశ మౌలికరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘ స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మోదీనే ఎంచుకుంటారు’’ అని రాసి ఉన్న భారీ కటౌట్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. -
Sanath Nagar: మంత్రి తలసానికి హ్యాట్రిక్ రికార్డు దక్కేనా?
హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థీ ఇంతవరకు హ్యాట్రిక్ రికార్డును కైవసం చేసుకున్న చరిత్ర లేదు. మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వరుసగా ఆ విజయాలను నమోదు చేసుకున్న పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. 1978లో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1992, 1994లో వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి మర్రి శశిధర్‌రెడ్డి గెలుపొందగా 1999 ఎన్నికల్లో శ్రీపతిరాజేశ్వర్ గెలుపొందడంతో శశిధర్‌రెడ్డికి హ్యాట్రిక్ దూరమైంది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో సైతం మర్రి శశిధర్‌రెడ్డి రెండుసార్లు వరుస విజయాలను నమోదు చేసుకోగా 2014లో ఆయన పరాజయం పాలవడంతో మరోసారి హ్యాట్రిక్ మిస్ అయ్యింది. ఇక 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గెలుపొంది మరోసారి బీఆర్ఎస్ అభ్యర్ధిగా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్‌క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
ఢిల్లీ దూసుకెళుతోంది
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్ సాగే కొద్దీ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న క్యాపిటల్స్ ఈ లీగ్‌లో హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం ఒకే ఒక్క పోటీలో ఓడిపోయింది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌పై పంజా విసిరింది. మొదట బ్యాటింగ్ తడబడినా... హెట్మెయిర్ మెరుపులతో కోలుకున్న రాజస్తాన్ తర్వాత స్పిన్, పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. షార్జా: రాజస్తాన్ మొదటి మ్యాచ్‌లో మూడు సార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడింది. 200 పైచిలుకు పరుగులు చేసి గెలిచింది. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మరీ జయభేరి మోగించింది. అయితే రాన్రానూ 150, 160 పరుగులకే ఆపసోపాలు పడుతోంది. వరుసగా ఓటమి పాలవుతోంది. ఇప్పుడు కూడా ఆ వరుసలో నాలుగో పరాజయాన్ని చేర్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబడ 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. హెట్‌మైర్ సిక్సర్లతో... ఢిల్లీ ఆట మొదలయ్యాక టాప్–4 బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఓపెనర్లు పృథ్వీషా (19), ధావన్ (5) సహా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22), రిషభ్ పంత్ (5) బాధ్యతగా ఆడలేదు. ఇన్నింగ్స్‌ను పరుగులతో పేర్చలేదు. చెత్త షాట్లతో పృథ్వీ, ధావన్ ఔటైతే వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగు పెట్టిన అయ్యర్, పంత్ రనౌట్ అయ్యారు. ఫలితంగా 79 పరుగులకే ఈ నలుగుర్ని కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట స్టొయినిస్, తర్వాత హెట్‌మైర్ పెద్దదిక్కులా మారారు. స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్, రాహుల్ తేవటియా బౌలింగ్‌లో స్టొయినిస్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీంతో వికెట్లు రాలినా... పరుగుల కొరత లేనేలేదు. రన్‌రేట్ కూడా 8 పరుగులకు తగ్గలేదు. సిక్సర్లు కొడుతున్న స్టొయినిస్‌కు తెవాటియా చెక్ పెట్టాడు. దీంతో క్యాపిటల్స్ జట్టు 109 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఒకరే (హెట్‌మైర్) ఉండటంతో 150 పరుగుల స్కోరు చేస్తేనే ఎక్కువనే అంచనా ఏర్పడింది. కానీ ఆ ఒకడే కాసేపు జోరు అందుకున్నాడు. స్కోరు బోర్డును సిక్సర్లతో హోరు పెట్టించాడు. టై వేసిన 16వ ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టిన హెట్‌మైర్ ఆ తర్వాత కార్తీక్ త్యాగిని వదిలిపెట్టలేదు. 17వ ఓవర్లో లాంగాఫ్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా రెండు వరుస సిక్సర్లు బాదాడు. ఇదే ఊపుతో లాంగాన్లోనూ భారీ షాట్ కొట్టాడు. మెరుపు వేగంతో ఫ్లాట్‌గా దూసుకెళ్తున్న ఈ బంతిని బౌండరీ లైన్ దగ్గర్లో తెవాటియా గాల్లో ఎగిరి అందుకోవడంతో అతని సిక్సర్ల ఆటకు తెర పడింది. ఆఖర్లో అక్షర్ పటేల్ 4, 6, 4 కొట్టడంతో 200 ఖాయమనిపించినా... అతను అవుట్ కావడంతో పాటు, ఆర్చర్ 20వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో స్కోరు 184 వద్దే ఆగిపోయింది. రాజస్తాన్ పతనం... ఈ మ్యాచ్ చూసిన వారికి లీగ్ ఆరంభంలో కొండంత లక్ష్యాల్ని అవలీలగా పిండి చేసిన రాజస్తాన్, ఇప్పుడు ఆడుతున్న రాజస్తాన్ ఒకటేనా అన్న అనుమానం కలుగక మానదు. అప్పట్లో స్మిత్‌ను మించి సామ్సన్... సామ్సన్ను తలదన్నే సిక్సర్లతో తేవటియా రాయల్స్ ఇన్నింగ్స్‌ను గెలిచేదాకా నడిపించారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. ఒకరి కంటే తక్కువగా మరొకరు ఆడి... వికెట్లను సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో కుర్రాడు, ఓపెనర్ యశస్వి జైస్వాల్ కంటే మరో ఓపెనర్ బట్లర్ (13) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కెప్టెన్ స్మిత్ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కంటే నిర్లక్ష్యంగా సామ్సన్ (5) వికెట్ పారేసుకున్నాడు. పెవిలియన్ ‘క్యూ’ రబడ తొలి ఓవర్లో బట్లర్ బౌండరీలతో వేగం అందుకున్నాడు. ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ వెంటనే మూడో ఓవర్లోనే అశ్విన్‌ను రంగంలోకి దింపాడు. అతను వచ్చీ రాగానే బట్లర్‌కు పెవిలియన్ దారి చూపాడు. రబడ నాలుగో ఓవర్లో ఈ సారి స్మిత్ 6, 4 కొట్టాడు. 8 ఓవర్ల దాకా వేగం లేకపోయినా 56/1 స్కోరుతో మెరుగ్గానే కనిపించింది. ఆ తర్వాత బంతికే హెట్‌మైర్ అద్భుతమైన క్యాచ్‌కు స్మిత్ అవుట్ కావడం, స్వల్ప వ్యవధిలో సంజు సామ్సన్, లోమ్రోర్ (1)లతో పాటు కుదురుగా ఆడుతున్న జైస్వాల్ కూడా వెనుదిరిగారు. 82 పరుగులకే రాజస్తాన్ సగం వికెట్లను చేజార్చుకుంది. ఆండ్రూ టై (6), ఆర్చర్ (2)లు కూడా బ్యాట్లు ఎత్తేయడంతో 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్ లక్ష్యానికి అసాధ్యమైన దూరంలో నిలిచింది. తేవటియా కొట్టిన ఫోర్లు, సిక్సర్లు రాజస్తాన్ ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప గెలిచేందుకు పనికి రాలేదు. బ్యాటింగ్‌లో మెరిపించిన స్టొయినిస్ (2/17) కీలకమైన వికెట్లతో బంతితోనూ రాజస్తాన్‌ను దెబ్బతీశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి అండ్ బి) ఆర్చర్ 19; ధావన్ (సి) యశస్వి (బి) ఆర్చర్ 5; శ్రేయస్ (రనౌట్) 22; పంత్ (రనౌట్) 5; స్టొయినిస్ (సి) స్మిత్ (బి) తేవటియా 39; హెట్‌మైర్ (సి) తేవటియా (బి) కార్తీక్ త్యాగి 45; హర్షల్ (సి) తేవటియా (బి) ఆర్చర్ 16; అక్షర్ (సి) బట్లర్ (బి) టై 17; రబడ (నాటౌట్) 2; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–50, 4–79, 5–109, 6–149, 7–181, 8–183. బౌలింగ్: ఆరోన్ 2–0–25–0, ఆర్చర్ 4–0–24–3, కార్తీక్ త్యాగి 4–0–35–1, టై 4–0–50–1, గోపాల్ 2–0–23–0, తేవటియా 4–0–20–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) స్టొయినిస్ 34; బట్లర్ (సి) ధావన్ (బి) అశ్విన్ 13; స్మిత్ (సి) హెట్‌మైర్ (బి) నోర్జే 24; సంజు (సి) హెట్‌మైర్ (బి) స్టొయినిస్ 5; లోమ్రోర్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 1; తేవటియా (బి) రబడ 38; టై (సి) రబడ (బి) అక్షర్ 6; ఆర్చర్ (సి) శ్రేయస్ (బి) రబడ 2; గోపాల్ (సి) హెట్‌మైర్ (బి) హర్షల్ 2; కార్తీక్ త్యాగి (నాటౌట్) 2; వరుణ్ ఆరోన్ (సి) పంత్ (బి) రబడ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–15, 2–56, 3–72, 4–76, 5–82, 6–90, 7–100, 8–121, 9–136, 10–138. బౌలింగ్: రబడ 3.4–0–35–3, నోర్జే 4–0–25–1, అశ్విన్ 4–0–22–2, హర్షల్ 4–0–29–1, అక్షర్ 2–0–8–1, స్టొయినిస్ 2–0–17–2. -
వావ్ శ్రేయస్.. మరోసారి అదరగొట్టాడు!
శ్రేయస్ గోపాల్ మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. భారీ వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం చెరువును తలపించింది. దీంతో చివరకు 30-30 బాల్స్ (5 ఓవర్ల) మ్యాచ్‌ను ఆడించారు. 30 బంతుల మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ శ్రేయస్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ వేసిన శ్రేయస్.. మొదటి మూడు బంతులకు 6, 4, 2 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ తన బౌలింగ్ మాయాజాలంతో హ్యాట్రిక్ వికెట్లు తీసి మెరుపులకు కళ్లెంవేశాడు. వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టిన కోహ్లి నాలుగో బంతినీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌స్టోన్ క్యాచ్ పట్టడంతో కోహ్లి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటవ్వగా.. స్టొయినిస్ డకౌట్ కావడంతో ఈ సీజన్లో రెండో ‘హ్యాట్రిక్’ నమోదైంది. చివరకు మళ్లీ వర్షం రావడంతో ఈ మ్యాచ్ రద్దయింది. ఐపీఎల్లో ఒకే సీజన్లో కోహ్లి, డివిలియర్స్‌లను మూడేసి సార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా శ్రేయస్ గోపాల్ నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్ వంటి బ్యాట్స్‌మెన్‌ను వెనువెంటనే ఔట్ చేసిన శ్రేయస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 19వ హ్యాట్రిక్.. ఐపీఎల్ చరిత్రలో ‘హ్యాట్రిక్’ తీసిన 16వ బౌలర్ శ్రేయస్ గోపాల్. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అమిత్ మిశ్రా (ఢిల్లీ, డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్) మూడుసార్లు... యువరాజ్ సింగ్ (పంజాబ్) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. లక్ష్మీపతి బాలాజీ (చెన్నై), ఎన్తిని (చెన్నై), రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్), ప్రవీణ్ కుమార్ (బెంగళూరు), అజీత్ చండేలా (రాజస్తాన్), సునీల్ నరైన్ (కోల్‌కతా), ప్రవీణ్ తాంబే (రాజస్తాన్), షేన్ వాట్సన్ (రాజస్తాన్), అక్షర్ పటేల్ (పంజాబ్), సామ్యూల్ బద్రీ (బెంగళూరు), ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్), జైదేవ్ ఉనాద్కట్ (పుణే), స్యామ్ కరన్ (పంజాబ్), శ్రేయస్ గోపాల్ (రాజస్తాన్) ఒక్కోసారి హ్యాట్రిక్ నమోదు చేశారు. Wow. Shreyas Gopal with the Kohli-ABD double-double in 2019. #IPL2019 — Vinayakk (@vinayakkm) April 30, 2019 -
కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు
'గుడివాడ ఎవడబ్బ సొత్తూ కాదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని నిరూపించారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ...ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నానికి గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఓ పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీనపడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అట్లూరి సుబ్బారావు నామమాత్రంగానే నిలిచారు.