ఓటెత్తారు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం నమోదైంది. 2009 ఎన్నికల్లో ఈ 19 లోక్‌సభ స్థానాల్లో 54.14 శాతం పోలింగ్ నమోదవుతే ఈసారి అది 62.36 శాతానికి చేరుకుంది. అత్యధికంగా హత్కనంగలేలో 69 శాతం, కొల్హాపూర్, ఉస్మానాబాద్, బీడ్‌లో 65 శాతం, షోలాపూర్‌లో అత్యల్పంగా 57 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ప్రశాంతంగా ఎన్నికలు...
పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, మరాఠ్వాడా, కొంకణ్‌లోని 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో చెదురు ముదురు సంఘటనలు మినహా రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈవీఎంల మెరాయింపులు, ఏ బటన్ నొక్కినా ఒకరికే ఓటు వెళ్లడం తదితర సంఘటనలతోపాటు కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే అంతటా పోలింగ్ మాత్రం సజావుగానే ముగిసింది.
ఈవీఎంలలో నేతల భవితవ్యం...
రెండో దశలో పోటీ చేసిన 358 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లో భద్రమైంది. ఎండ ప్రభావంతోపాటు అనేక ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక ప్రాంతాల్లో ఉదయం పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. మధ్యాహ్నం ఎండ ప్రభావానికి ఓటర్లు సంఖ్య పలుచబడింది. అయితే సాయంత్రం అనేక మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావడం కనిపించింది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పలు నియోజకవర్గాలలో జరిగిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. కొన్నిచోట్లా ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతవడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలు ఓటు వేయకుండానే నిరాశతో వెనుదిరిగారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు.
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు..
అనేక మంది ప్రముఖులు వారివారి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షోలాపూర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ సీఎం అశోక్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, సుప్రియా సూలే, గోపీనాథ్ ముండే, రాజు శెట్టి తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాలేగాన్సిద్ధిలో ఉదయం ఓటు వేసిన తర్వాత అన్నా హజారే మాట్లాడుతూ...అందరు తమ కర్తవ్యంగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
పుణేలో...
పుణేలో ఓ ఈవీఎంలోని ఏ బటన్ నొక్కినా కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదంకే ఓటు వెళ్లడాన్ని ఓ ఓటరు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. శ్యామ్‌రావ్ కల్మాడీ స్కూల్ పోలింగ్ బూత్‌లో కొంత సమయం పోలింగ్‌ను నిలిపివేశారు. అయితే అప్పటికే 28 మంది ఆ ఈవీఎం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీజేపీతోపాటు ఇతర పార్టీలు అక్కడ మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, లేనిచో ఆ 28 మందికి మళ్లీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎంతో పోలింగ్ ప్రారంభించిన అనంతరం ఆ 28 మందికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు.
ఓటర్ లిస్ట్‌లో పేర్లు గల్లంతు...
పుణేతోపాటు అనేక ప్రాంతాల్లో ప్రజలు ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పుణే కోథ్రూడ్, సింహగఢ్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. కేర్గావ్ పార్క్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ లిస్టులో సచిన్ నహర్ ఫొటో బదులు మరో మహిళా ఫొటో ముద్రితమైంది.
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్...
పుణేలోని నగర్వాలా స్కూల్ పోలింగ్ బూత్‌లో గంట ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. ఈవీఎం మోరాయించడంతో మరో ఈవీఎంలు అందుబాటులో లేకపోవడంతో పుణే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే మరో ఈవీఎంను తీసుకువచ్చి పోలింగ్‌ను ప్రారంభించారు.
ఈవీఎంలో పార్టీ గుర్తు లేదని ఫిర్యాదు..
పుణేలో ఈవీఎంలో బీజేపీ గుర్తు కనిపించడం లేదని హడప్సర్లోని కొందరు ఓటర్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈవీఎంను పరిశీలించగా మహాకూటమి పొత్తులో భాగంగా శివసేన పార్టీ గుర్తును ఉంచినట్లు పేర్కొన్నారు.
షోలాపూర్‌లో...: పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడేల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వీరు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యయం పెరుగుతుండడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు.