గ్రీన్ డైట్
పచ్చదనాన్ని పరిచుకున్న డైట్ కళాశాల
పాతికేళ్లుగా డ్రిప్‌తో మొక్కల పెంపకం
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సిబ్బంది
మెదక్ : ‘వృక్షో రక్షితి.. రక్షితహ’.. ఈ సామెతను కొందరు అధికారులు అక్షరసత్యం చేస్తున్నారు. ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు బోధించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములు చేస్తున్నారు. ఫలితంగా మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ శివారులోని డైట్ కాలేజీలో పచ్చదనం ఉట్టిపడుతోంది.
18 ఎకరాల్లో...
ఘణపూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో 1990లో డైట్ కాలేజీ ఏర్పాౖటెంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలకు సంబంధించిన సుమారు 300లకు పైగా ఛాత్రోపాధ్యాయులు ఏటా శిక్షణ పొందుతున్నారు. విశాలమైన స్థలం ఉండటంతో పాతికేళ్ల క్రితమే అధ్యాపక సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. బోరుబావి తవ్వించి డ్రిప్ పద్ధతిలో నీరు పెడుతున్నారు. దీంతో డైట్కాలేజీ గ్రీనరీని సొంతం చేసుకుంది. కళాశాల గదులు రెండు ఎకరాల్లో నిర్మించగా మిగతా 16 ఎకరాల్లో పచ్చదనం పరుచుకుంది. జిల్లాలోని పచ్చదనం ఉన్న ఏకైక కాలేజీకి పేరుగడించింది.
పలు రకాల చెట్లు
ఇక్కడ ముఖ్యంగా వేప, మామిడి, అల్లనేరేడు, అశోక, షో ట్రీస్, ఉసిరిచెట్లతో పాటు పలు రకాల పూలమొక్కలు ఏపుగా పెరిగాయి. స్వాగత తోరణం నుంచి దారికి ఇరువైపులా పొడవాటి చెట్లు స్వాగతం పలుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే కాలేజీ పరిసరాలు అడవిని స్ఫురింపజేస్తాయి. గత సంవత్సరం హరితహారంలో పథకంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు డైట్కాలేజీలో మొక్కలు నాటారు.
మొక్కల దత్తతు
మొక్కలను నాటి వాటిని సంర క్షించినవారే తమ తల్లిదండ్రులతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడతారు. నిత్యం ఛాత్రోపాధ్యాయులకు పాఠాలతో పాటు పర్యావరణ రక్షణ గురించి ప్రాక్టికల్‌గా మొక్కలు నాటి, వాటిని వారికి దత్తత ఇస్తున్నాం. సిబ్బందితో పాటు అభ్యర్థుల కృషితో కాలేజీ ఆవరణ వనంలా మారింది. – రమేశ్‌బాబు, ప్రిన్సిపాల్