Health cards scheme
-
నత్తనడకన హెల్త్‌కార్డుల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగుల వివరాల నమోదు నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షలమంది పెన్షనర్లు, 8 లక్షలమంది ఉద్యోగులుండగా.. ఇప్పటి వరకు 2 లక్షల మందే వివరాలు నమోదు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1.5 లక్షల మంది పెన్షనర్లు కాగా, మిగిలిన 50 వేల మంది ఉద్యోగులున్నారు. ఈ పథకాన్ని వచ్చేనెల 5న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సర్కారు.. వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేసే దిశగా మాత్రం చొరవ చూపడంలేదు. హెల్త్‌కార్డులు పొందాలనుకునే ఉద్యోగులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. మీసేవ ద్వారా కూడా నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డేటా నమోదుకు సర్వీస్ రిజిస్టర్(ఎస్ఆర్)లోని తొలి రెండు పేజీల(కొత్త సర్వీసు రిజిస్టర్ అయితే 4, 5 పేజీలు) జిరాక్స్ కాపీలు, ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యులందరి వేర్వేరు డిజిటల్ ఫొటోలు, ఆధార్ కార్డులు లేదా ఆధార్ నమోదు రసీదులు అవసరం. ఆన్లైన్లో అప్లోడ్ చేశాక వచ్చే ఎన్రోల్మెంట్ కాపీని సంబంధిత డ్రాయింగ్ అధికారికి, పెన్షనర్లు అయితే సంబంధిత పెన్షన్ చెల్లింపు అధికారికి సమర్పించాలి. డ్రాయింగ్ అధికారులకు ఉద్యోగుల ఎన్రోల్మెంట్ కాపీ సమర్పించిన తర్వాత, వారి వద్దనున్న వివరాలను సరిచూసి ‘వాలిడేషన్’ చేస్తారు. ఆ తర్వాతే ఆన్లైన్లో తాత్కాలిక హెల్త్‌కార్డు సిద్ధమవుతుంది. ఈ కార్డుతో వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక కార్డు వచ్చిన 30 రోజుల్లో బయోమెట్రిక్ కార్డును ప్రభుత్వం రూపొందిస్తుంది. అయితే, ఎస్‌ఆర్‌లో తొలి రెండు పేజీల కాపీలు తీసుకోవడానికి వీలుగా అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేయాలి. ఈనెల 1నే జీవో వెలువడినా, ఇప్పటి వరకు యంత్రాంగానికి మాత్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. కాగా హెల్త్‌కార్డుల పథకంలో వివరాలు నమోదు చేసుకోవాలంటూ ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జీవో విడుదల చేసి 20 రోజులవుతున్నా డేటా నమోదుపై సర్కారు ఆసక్తి చూపట్లేదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లకూ స్పందన కరవు పథకం ప్రారంభానికి ముందే దాని అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు. అవుట్ పేషెంట్(ఓపీ) సౌకర్యా న్ని పథకంలో భాగంగా అమలు చేయాలనే డిమాండ్‌ను పట్టిం చుకోలేదు. రోగ నిర్ధారణకయ్యే ఖర్చును ఉద్యోగులపై వేయకుండా సర్కారే భరించాలంటూ చేస్తున్న డిమాండ్‌కు స్పందన లేదు. మాస్టర్ హెల్త్ చెకప్ ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడానికి అవకాశం ఇవ్వమంటున్నా ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. 347 జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని విధించిన నిబంధనపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ జబ్బుకైనా వైద్యం ఎక్కడ చేయించుకోవాలనేదానిపై నిర్ణయించుకునే అవకాశం ఉద్యోగులకే ఇవ్వాలన్న డిమాండ్‌కు సర్కారు స్పందించలేదు. -
ఉద్యోగుల వైద్యానికి రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యం అందించేందుకు హెల్త్‌కార్డుల పథకం కింద ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 8.60 లక్షల మంది ఉద్యోగులు, 5.40 లక్షల మంది పెన్షన్‌దారులతో కలిపి 14 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 70 లక్షల మందికి దీపావళి కానుకగా ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉద్యోగుల నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆరోగ్య కార్డులను అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈమేరకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిలతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం 1,885 చికిత్సలు పథకంలో ఉన్నాయని, వీటికి అదనంగా మరిన్ని చికిత్సలను చేర్చుతామని సీఎం తెలిపారు. చికిత్సకయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు చెల్లిస్తారన్నారు. ప్రస్తుతం పథకం అమలు బాధ్యతలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అప్పగించామని, భవిష్యత్‌లో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.2 లక్షలు చికిత్స పరిమితి ఉందని, అయితే ఎన్నిసార్లైనా వైద్య సేవలు పొందడానికి అర్హత కల్పించామని, చికిత్సకయ్యే పరిమితి దాటినా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆస్పత్రులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఏడాది పాటు డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికీ ఏడాదికొకసారి మాస్టర్ హెల్త్ చెకప్ సౌకర్యం ఉంటుందన్నారు. పథకం అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు.