సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు నగదు రహిత వైద్యం అందించేందుకు హెల్త్‌కార్డుల పథకం కింద ఏటా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 8.60 లక్షల మంది ఉద్యోగులు, 5.40 లక్షల మంది పెన్షన్‌దారులతో కలిపి 14 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 70 లక్షల మందికి దీపావళి కానుకగా ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉద్యోగుల నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆరోగ్య కార్డులను అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈమేరకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిలతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం 1,885 చికిత్సలు పథకంలో ఉన్నాయని, వీటికి అదనంగా మరిన్ని చికిత్సలను చేర్చుతామని సీఎం తెలిపారు. చికిత్సకయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు చెల్లిస్తారన్నారు. ప్రస్తుతం పథకం అమలు బాధ్యతలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అప్పగించామని, భవిష్యత్‌లో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్, వారి కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.2 లక్షలు చికిత్స పరిమితి ఉందని, అయితే ఎన్నిసార్లైనా వైద్య సేవలు పొందడానికి అర్హత కల్పించామని, చికిత్సకయ్యే పరిమితి దాటినా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆస్పత్రులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఏడాది పాటు డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికీ ఏడాదికొకసారి మాస్టర్ హెల్త్ చెకప్ సౌకర్యం ఉంటుందన్నారు. పథకం అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు.
ఉద్యోగుల వైద్యానికి రూ.400 కోట్లు
Published Mon, Nov 4 2013 2:55 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement