సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకంలో ఉద్యోగుల వివరాల నమోదు నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షలమంది పెన్షనర్లు, 8 లక్షలమంది ఉద్యోగులుండగా.. ఇప్పటి వరకు 2 లక్షల మందే వివరాలు నమోదు చేసుకున్నారు. వీరిలో దాదాపు 1.5 లక్షల మంది పెన్షనర్లు కాగా, మిగిలిన 50 వేల మంది ఉద్యోగులున్నారు. ఈ పథకాన్ని వచ్చేనెల 5న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న సర్కారు.. వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేసే దిశగా మాత్రం చొరవ చూపడంలేదు. హెల్త్‌కార్డులు పొందాలనుకునే ఉద్యోగులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
మీసేవ ద్వారా కూడా నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డేటా నమోదుకు సర్వీస్ రిజిస్టర్(ఎస్‌ఆర్)లోని తొలి రెండు పేజీల(కొత్త సర్వీసు రిజిస్టర్ అయితే 4, 5 పేజీలు) జిరాక్స్ కాపీలు, ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యులందరి వేర్వేరు డిజిటల్ ఫొటోలు, ఆధార్ కార్డులు లేదా ఆధార్ నమోదు రసీదులు అవసరం. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాక వచ్చే ఎన్‌రోల్‌మెంట్ కాపీని సంబంధిత డ్రాయింగ్ అధికారికి, పెన్షనర్లు అయితే సంబంధిత పెన్షన్ చెల్లింపు అధికారికి సమర్పించాలి. డ్రాయింగ్ అధికారులకు ఉద్యోగుల ఎన్‌రోల్‌మెంట్ కాపీ సమర్పించిన తర్వాత, వారి వద్దనున్న వివరాలను సరిచూసి ‘వాలిడేషన్’ చేస్తారు. ఆ తర్వాతే ఆన్‌లైన్‌లో తాత్కాలిక హెల్త్‌కార్డు సిద్ధమవుతుంది. ఈ కార్డుతో వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక కార్డు వచ్చిన 30 రోజుల్లో బయోమెట్రిక్ కార్డును ప్రభుత్వం రూపొందిస్తుంది. అయితే, ఎస్‌ఆర్‌లో తొలి రెండు పేజీల కాపీలు తీసుకోవడానికి వీలుగా అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేయాలి. ఈనెల 1నే జీవో వెలువడినా, ఇప్పటి వరకు యంత్రాంగానికి మాత్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. కాగా హెల్త్‌కార్డుల పథకంలో వివరాలు నమోదు చేసుకోవాలంటూ ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జీవో విడుదల చేసి 20 రోజులవుతున్నా డేటా నమోదుపై సర్కారు ఆసక్తి చూపట్లేదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్లకూ స్పందన కరవు
పథకం ప్రారంభానికి ముందే దాని అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు. అవుట్ పేషెంట్(ఓపీ) సౌకర్యా న్ని పథకంలో భాగంగా అమలు చేయాలనే డిమాండ్‌ను పట్టిం చుకోలేదు. రోగ నిర్ధారణకయ్యే ఖర్చును ఉద్యోగులపై వేయకుండా సర్కారే భరించాలంటూ చేస్తున్న డిమాండ్‌కు స్పందన లేదు. మాస్టర్ హెల్త్ చెకప్ ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవడానికి అవకాశం ఇవ్వమంటున్నా ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. 347 జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని విధించిన నిబంధనపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ జబ్బుకైనా వైద్యం ఎక్కడ చేయించుకోవాలనేదానిపై నిర్ణయించుకునే అవకాశం ఉద్యోగులకే ఇవ్వాలన్న డిమాండ్‌కు సర్కారు స్పందించలేదు.
నత్తనడకన హెల్త్‌కార్డుల నమోదు
Published Mon, Nov 18 2013 3:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement