Health Drink
-
‘బోర్న్‌విటా’ పై కేంద్రం కీలక ఆదేశాలు.. తక్షణమే అమల్లోకి
న్యూఢిల్లీ: చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్సైట్లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులపై ‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిల్లో బోర్న్‌వీటా సైతం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ)కి సబ్మిట్ చేసిన మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ (బోర్న్‌వీటా తయారీ కంపెనీ) సమర్పించిన నియమాలు, నిబంధనల్లో బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’గా నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ అయితే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్) చట్టం 2005 సెక్షన్ (3) సీఆర్పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్సీపీసీఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ కీలక ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. పవర్ సప్లిమెంట్లను సైతం అంతకుముందు, భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను 'హెల్త్ డ్రింక్స్'గా విక్రయాలు జరుపుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది. ముఖ్యంగా, రెగ్యులేటరీ బాడీ ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ అని ఎక్కుడా వినియోగించకూడదు. కాదని హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తే సదరు కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో, డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ వినియోగించడాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తుంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఈ-కామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. -
హార్లిక్స్ తింటారా? తాగుతారా?
సాక్షి, ముంబై: "హార్లిక్స్ తాగను-తింటాను" అనే వాణిజ్య ప్రకటనతో దేశీయంగా బాగా పాపులర్ హెల్త్ డ్రింక్ హార్లిక్స్‌ను విక్రయించేందుకు గ్లాక్సో స్మిత్ క్లయిన్ నిర్ణయించింది. హార్లిక్స్, ఇతర పోషక ఉత్పత్తుల వ్యాపారంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని సంస్థ యోచిస్తోంది. 2018 చివరినాటికి ఈ విక్రయాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఫార్మాస్యూటికల్స్, కన్జూమర్ హెల్త్‌కేర్‌పై దృష్టి సారించనున్న నేపథ్యంలో జీఎస్కే ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్లిక్స్ బ్రాండ్ కు సుమారు రూ. 25 వేల కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) వరకూ ధర వస్తుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. హార్లిక్స్ వ్యాపార ఆదాయం 2017 లో 550 మిలియన్లు (రూ .5,050 కోట్లు)గా ఉందని తెలిపింది. త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ జీఎస్కే మొత్తం ఆదాయంలో 85శాతం వాటా హార్లిక్స్‌దే. ఈ మొత్తంపై అధిక ప్రీమియంను ఆఫర్ చేసే సంస్థకు హార్లిక్స్ బ్రాడ్‌ను అప్పగించాలని జీఎస్కే భావిస్తోంది. అయితే ఆరోగ్య ఆహార పానీయాలలో 44.1శాతం మార్కెట్ వాటా కలిగిన హార్లిక్స్‌ను కొనుగోలు చేసే ఆసక్తి, అర్హత ఎవరికి ఉంది అనేది కీలకంగా మారింది. ఐటీసీ లిమిటెడ్ బహుశా ఇంత పెద్ద కొనుగోలుకు అవసరమైన బ్యాలెన్స్ షీట్ బలం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హార్లిక్స్ ను సొంతం చేసుకునేందుకు నెస్లే, క్రాఫ్ట్ హీంజ్, యూనీలివర్ వంటి ఆహారోత్పత్తుల సంస్థలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు కోకా-కోలా, పెప్సికో, సంటరీ, మోడెలిజ్ ఇంటర్నేషనల్, కాఫీ బిజినెస్ యజమాని జాబ్ లాంటి ఇతర సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రపంచంలోని అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీగా ఉన్న నెస్లే, జీఎస్కే మధ్య హార్లిక్స్ విక్రయంపై గతంలోనే చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా స్పందించడానికి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న నెస్లే నిరాకరించింది. కాగా మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ప్రసిద్ధి చెందిన హార్లిక్స్ పౌష్టికాహారం, బిస్కెట్ల రంగంలోకూడా తనకంటూ ఓ ముద్రను వేసుకుంది. సుమారు 140 సంవత్సరాలుగా ఇండియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. 1873లో బ్రిటీష్ సోదరులు జేమ్స్, విలియమ్ హార్లిక్స్ లు తొలిసారిగా షికాగోలో హార్లిక్స్ తయారీని ప్రారంభించారు. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ వార్త జీఎస్కే పెట్టుబడిదారులను, ఇటు హార్లిక్స్ అధికంగా ఇష్టపడే వారిని షాక్‌కు గురిచేసింది. కొత్త యజమాని ఆధ్వర్యంలో హార్లిక్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది కాలమే తేల్చాలి. -
మంత్రి వ్యాఖ్యలపై మహిళల కన్నెర్ర
♦ బీర్‌ను హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్ ♦ మండిపడుతున్ననారీ సంఘాలు ♦ మెడికల్ షాపుల్లో కూడా బీర్ అమ్ముతారా? ♦ విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారు ? ♦ ఉద్యమించడానికి సన్నద్ధం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక పక్క మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని పదేపదే చెబుతున్న మంత్రి జవహర్ మరోవైపు బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామన్న వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడుతోంది. మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్ముతారా అని ప్రశ్నిస్తోంది. గౌరవప్రద ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మంత్రి బీరును హెల్త్‌డ్రింక్‌గా చెప్పడం ద్వారా విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం ఎంతకైనా దిగజారడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత మద్యానికి బానిస అవుతుంటే ప్రభుత్వమే హెల్త్ డ్రింక్ అంటూ బీరును ప్రమోట్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇళ్ల మద్యన మద్యం దుకాణాలపై ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టడాన్ని మహిళా సంఘాలు తప్పు పడుతున్నాయి. మద్యం పాలసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో ఉద్యమించడానికి మహిళా సంఘాలు సన్నద్దం అవుతున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్టు నిబంధనలను తప్పించుకోవడం కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రహదారులుగా మార్చడం, రాష్ట్ర రహదారులను మున్సిపల్, అర్బన్ రహదారులుగా మార్పులు చేయడం ఆదాయం కోసం కాకపోతే మరెందుకని వారు నిలదీస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల మధ్యన మద్యం దుకాణాల ఏర్పాటుపై మంగళవారం కూడా ఆందోళనలు జరిగాయి. చింతలపూడి మండలంలోని భట్టువారిగూడెం, రాఘవాపురం గ్రామాల్లో జనావాసాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని ఆందోళనలు జరిపారు. భట్టువారిగూడెంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వారు తమ ఇళ్ళకు వచ్చి తలుపులు కొడుతున్నారని గ్లాసులు కావాలని అడుగుతున్నారని వాపోయారు. రాఘవాపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని తరలించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చింతలపూడి –సత్తుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శివాలయం సమీపంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం వద్ద మద్యం దుకాణం పెడుతున్నారని ఆరోపించారు. మొగల్తూరు పంచాయతీ కాలువరోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి రోడ్డులో మద్యం దుకాణ ఏర్పాటు వ్యతిరేకిస్తూ మహిళలు నిరశన కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మరోసారి నిరశన కార్యక్రమాలు చేపట్టారు. పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయంటూ నిరశన వ్యక్తం చేశారు. ఉదయం సిద్ధాంతంలో ర్యాలీ నిర్వహించి మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా పంచాయతీ తీర్మానం చేయాలంటూ సర్పంచ్ బిరుదగంటి రత్నరాజుకు వినతిపత్రం అందించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి ఇలాగేనా మాట్లాడేది..? పోడూరు : ‘బీరు’ను హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్.జవహార్ చేసిన వాఖ్యలను మహిళాలోకం తీవ్రస్థాయిలో ఖండిస్తోంది. మంత్రిస్థాయి నేత ఇటువంటి వాఖ్యలు చేయడం చూస్తోంటే ఈ ప్రభుత్వం సమాజాన్ని ఎటువైపు నడిపిచాలనుకుంటోందని మహిళలు ఆగ్రహావేశాలతో మండి పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి ని చేపట్టిన మంత్రి జవహార్ ఇలాగేనా మాట్లాడేది...పిల్లలకు ఇలాగే పాఠాలు చెప్పారా...?అని పలువురు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. సిగ్గు చేటు.., బీరు హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తానని సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి పేర్కొనడం సిగ్గుచేటు. పేద, మధ్య తరగతికి చెందిన లక్షలాది మంది మద్యానికి బానిసలు కావడంతో వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికి చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ మంత్రి చేసిన వాఖ్యలు లక్షలాదిమందిని మద్యానికి బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయి. – గుంటూరి వాణి పెద్దిరాజు, ఎంపీపీ, పోడూరు బాధాకరం రాష్ట్ర ఎక్సైజ్ మంత్రే ఇటువంటి వాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి వాఖ్యలు కనబడుతున్నాయి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి మంత్రి స్థాయికి వచ్చిన నాయకుడు ఇలా మాట్లాడటం ఆందోళనకరమైన విషయం. మంత్రి తన వాఖ్యలను ఉపసంహరించుకోవాలి. – కుడిపూడి నాగలక్ష్మి, ఎంపీటీసీ, గుమ్మలూరు మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి వారిని నిర్వీర్యం చేస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మద్యాన్ని ఆరోగ్య పానీయంగా పేర్కొనడం విడ్డూరం. పురుషులకు మద్యాన్ని అలవాటు చేసి వారి కుటుంబాలను తిరోగమనంలోకి నెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దానినుంచి తప్పించుకోవడానికి ఆ రహదార్లను ప్రాంతీయ రహదార్లుగా మార్చాలని నిర్ణయించటం మద్య నియంత్రణపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుపుతోంది. బీరుపై బాధ్యతారహిత వ్యాఖ్యానం చేసిన మంత్రి జవహర్‌ను పదవి నుంచి తొలగించాలి. ఇళ్లు, ప్రార్థనా మందిరాల చెంత మద్యం దుకాణాల ఏర్పాటును మహిళలు, స్థానికులు అడ్డుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం దారుణం. – పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ