మంత్రి వ్యాఖ్యలపై మహిళల కన్నెర్ర
♦ బీర్‌ను హెల్త్ డ్రింక్ అన్న మంత్రి జవహర్
♦ మండిపడుతున్ననారీ సంఘాలు
♦ మెడికల్ షాపుల్లో కూడా బీర్ అమ్ముతారా?
♦ విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారు ?
♦ ఉద్యమించడానికి సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఒక పక్క మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని పదేపదే చెబుతున్న మంత్రి జవహర్ మరోవైపు బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామన్న వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడుతోంది. మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్ముతారా అని ప్రశ్నిస్తోంది. గౌరవప్రద ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మంత్రి బీరును హెల్త్‌డ్రింక్‌గా చెప్పడం ద్వారా విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఆదాయం కోసం ఎంతకైనా దిగజారడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత మద్యానికి బానిస అవుతుంటే ప్రభుత్వమే హెల్త్ డ్రింక్ అంటూ బీరును ప్రమోట్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇళ్ల మద్యన మద్యం దుకాణాలపై ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టడాన్ని మహిళా సంఘాలు తప్పు పడుతున్నాయి. మద్యం పాలసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో ఉద్యమించడానికి మహిళా సంఘాలు సన్నద్దం అవుతున్నాయి.
ఇప్పటికే సుప్రీం కోర్టు నిబంధనలను తప్పించుకోవడం కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రహదారులుగా మార్చడం, రాష్ట్ర రహదారులను మున్సిపల్, అర్బన్ రహదారులుగా మార్పులు చేయడం ఆదాయం కోసం కాకపోతే మరెందుకని వారు నిలదీస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల మధ్యన మద్యం దుకాణాల ఏర్పాటుపై మంగళవారం కూడా ఆందోళనలు జరిగాయి.
చింతలపూడి మండలంలోని భట్టువారిగూడెం, రాఘవాపురం గ్రామాల్లో జనావాసాల మధ్య మద్యం దుకాణాలను తొలగించాలని ఆందోళనలు జరిపారు. భట్టువారిగూడెంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వారు తమ ఇళ్ళకు వచ్చి తలుపులు కొడుతున్నారని గ్లాసులు కావాలని అడుగుతున్నారని వాపోయారు. రాఘవాపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని తరలించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చింతలపూడి –సత్తుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
శివాలయం సమీపంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం వద్ద మద్యం దుకాణం పెడుతున్నారని ఆరోపించారు. మొగల్తూరు పంచాయతీ కాలువరోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి రోడ్డులో మద్యం దుకాణ ఏర్పాటు వ్యతిరేకిస్తూ మహిళలు నిరశన కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మరోసారి నిరశన కార్యక్రమాలు చేపట్టారు. పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయంటూ నిరశన వ్యక్తం చేశారు. ఉదయం సిద్ధాంతంలో ర్యాలీ నిర్వహించి మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా పంచాయతీ తీర్మానం చేయాలంటూ సర్పంచ్ బిరుదగంటి రత్నరాజుకు వినతిపత్రం అందించారు.
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి ఇలాగేనా మాట్లాడేది..?
పోడూరు : ‘బీరు’ను హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్.జవహార్ చేసిన వాఖ్యలను మహిళాలోకం తీవ్రస్థాయిలో ఖండిస్తోంది. మంత్రిస్థాయి నేత ఇటువంటి వాఖ్యలు చేయడం చూస్తోంటే ఈ ప్రభుత్వం సమాజాన్ని ఎటువైపు నడిపిచాలనుకుంటోందని మహిళలు ఆగ్రహావేశాలతో మండి పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి ని చేపట్టిన మంత్రి జవహార్ ఇలాగేనా మాట్లాడేది...పిల్లలకు ఇలాగే పాఠాలు చెప్పారా...?అని పలువురు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
సిగ్గు చేటు..,
బీరు హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తానని సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి పేర్కొనడం సిగ్గుచేటు. పేద, మధ్య తరగతికి చెందిన లక్షలాది మంది మద్యానికి బానిసలు కావడంతో వారి కుటుంబాలు ఆర్ధికంగా చితికి చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ మంత్రి చేసిన వాఖ్యలు లక్షలాదిమందిని మద్యానికి బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయి.
– గుంటూరి వాణి పెద్దిరాజు, ఎంపీపీ, పోడూరు
బాధాకరం
రాష్ట్ర ఎక్సైజ్ మంత్రే ఇటువంటి వాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా మంత్రి వాఖ్యలు కనబడుతున్నాయి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి మంత్రి స్థాయికి వచ్చిన నాయకుడు ఇలా మాట్లాడటం ఆందోళనకరమైన విషయం. మంత్రి తన వాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
– కుడిపూడి నాగలక్ష్మి, ఎంపీటీసీ, గుమ్మలూరు
మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం
టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి వారిని నిర్వీర్యం చేస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మద్యాన్ని ఆరోగ్య పానీయంగా పేర్కొనడం విడ్డూరం. పురుషులకు మద్యాన్ని అలవాటు చేసి వారి కుటుంబాలను తిరోగమనంలోకి నెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దానినుంచి తప్పించుకోవడానికి ఆ రహదార్లను ప్రాంతీయ రహదార్లుగా మార్చాలని నిర్ణయించటం మద్య నియంత్రణపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుపుతోంది. బీరుపై బాధ్యతారహిత వ్యాఖ్యానం చేసిన మంత్రి జవహర్‌ను పదవి నుంచి తొలగించాలి. ఇళ్లు, ప్రార్థనా మందిరాల చెంత మద్యం దుకాణాల ఏర్పాటును మహిళలు, స్థానికులు అడ్డుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం దారుణం.
– పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ