గత ప్రభుత్వ హయాం నుంచే కొనసాగుతున్న వైనం.. కొత్త ప్రభుత్వంలో తాజా బిల్లులకే చెల్లింపులు
ఆరు నెలల క్రితమే ఎక్సైజ్ శాఖకు యూబీ కంపెనీ లేఖ.. తాజాగా బీర్ల సరఫరా నిలిపివేతకు నిర్ణయం
ప్రభుత్వం ముందున్నది రెండే మార్గాలంటున్న ఎక్సైజ్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: మద్యం సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చెల్లించాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్‌తో పాటు బీర్లు తయారు చేసే కంపెనీలన్నింటికీ కలిపి ఈ మేరకు బకాయిలు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ బకాయిలు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒప్పందం మేరకు 45 రోజులకు బిల్లులు చెల్లిస్తున్నారే కానీ పాత బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదని పేర్కొంటున్నాయి.
బకాయిలు కొనసాగుతుండడాన్ని కంపెనీలు భరించలేకపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. యూబీతో పాటు బీర్లు సరఫరా చేసే ఏబీ, ఇతర లిక్కర్ కంపెనీలు కూడా బిల్లుల ఉక్కిరిబిక్కిరిలోనే ఉన్నాయనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. తమకు బకాయిలు చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేస్తామంటూ ఆరు నెలల క్రితమే యూబీ కంపెనీ నుంచి ఎక్సైజ్ శాఖకు లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బిల్లులు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నందున ప్రభుత్వం ధీమాతో ఉందని సమాచారం.
యూబీ లేఖతోనే తెరపైకి ‘సోం’!
సరఫరా నిలిపివేస్తామంటూ యూబీ లేఖ రాసిన నేపథ్యంలోనే ఎక్సైజ్ వర్గాలు ముందుచూపుతో మరో డిస్టిలరీకి అనుమతినిచ్చే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీలకు ఉండే ‘రాజకీయ’ సంబంధాల కారణంగా, యూబీకి చెక్ పెట్టాలనే యోచనతో ప్రభుత్వం కూడా ప్రోత్సహించిందని, ఈ పరిస్థితుల్లోనే సోం డిస్టిలరీస్ అనే మరో బీర్ల కంపెనీ తెరపైకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ డిస్టిలరీకి అనుమతుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో సదరు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే ఇప్పుడు యూబీ నిర్ణయం నేపథ్యంలో.. ఆ కంపెనీ అడిగిన విధంగా మద్యం సరఫరా చేసే కంపెనీల బేసిక్ ధరలను పెంచడం లేదంటే బీర్ల తయారీ కోసం సోం డిస్టిలరీస్ లాంటి కంపెనీలకు అనుమతులివ్వడం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు అంటున్నారు.
ఇతర మద్యం బ్రాండ్లకు కొరత !
యూబీ కంపెనీ నిర్ణయంతో కింగ్‌ఫిషర్ బీర్లు డిపో లకు రావడం నిలిచిపోయింది. దీంతో బుధవారం నాటికి డిపోల నుంచి తీసుకున్న బీర్లు మాత్రమే ప్రస్తుతం వైన్‌షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బీర్లు వారం వరకు సరిపోతాయని, అప్పటికి పరిష్కారం రాకపోతే కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడుతుందని ఎక్సైజ్ వర్గాలంటున్నా యి. ఇదిలావుంటే ఇతర మద్యం బ్రాండ్లకు ఇప్పటికే మార్కెట్‌లో కొరత వచ్చిందని తెలుస్తోంది. సియా గ్రామ్స్ అనే కంపెనీ తయారు చేసే 100 పైపర్స్, బ్లెండర్స్ ప్రైడ్, రాయల్‌స్టాగ్ లాంటి ప్రీమియం బాండ్ల సరఫరా నిలిచిపోయిందని సమా చారం. దీంతో ఇప్పటికే మార్కెట్‌లో ఆయా బ్రాండ్లు దొరకడం లేదని వైన్‌షాపుల యజమానులు చెపుతు న్నారు. అయితే ఇందుకు వికారాబాద్ జిల్లాలోని ఒక డిస్టిలరీని ప్రభుత్వం మూసివేయడమే కారణమని, ఈ డిస్టిలరీలోనే సియాగ్రామ్స్ ప్రీమియం బ్రాండ్లు తయార వుతాయని, అందుకే ఆయా బ్రాండ్లు మార్కెట్‌లోకి రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment