సాక్షి, ముంబై: "హార్లిక్స్ తాగను-తింటాను" అనే వాణిజ్య ప్రకటనతో దేశీయంగా బాగా పాపులర్ హెల్త్ డ్రింక్ హార్లిక్స్‌ను విక్రయించేందుకు గ్లాక్సో స్మిత్ క్లయిన్ నిర్ణయించింది. హార్లిక్స్, ఇతర పోషక ఉత్పత్తుల వ్యాపారంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని సంస్థ యోచిస్తోంది. 2018 చివరినాటికి ఈ విక్రయాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఫార్మాస్యూటికల్స్, కన్జూమర్ హెల్త్‌కేర్‌పై దృష్టి సారించనున్న నేపథ్యంలో జీఎస్‌కే ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
హార్లిక్స్ బ్రాండ్ కు సుమారు రూ. 25 వేల కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) వరకూ ధర వస్తుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నోవార్టిస్ ను కొనుగోలు చేసిన తరువాత గ్లాక్సో స్మిత్ క్లయిన్, హార్లిక్స్ ను విక్రయించాలని నిర్ణయించింది. హార్లిక్స్ వ్యాపార ఆదాయం 2017 లో 550 మిలియన్లు (రూ .5,050 కోట్లు)గా ఉందని తెలిపింది. త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ జీఎస్‌కే మొత్తం ఆదాయంలో 85శాతం వాటా హార్లిక్స్‌దే. ఈ మొత్తంపై అధిక ప్రీమియంను ఆఫర్ చేసే సంస్థకు హార్లిక్స్ బ్రాడ్‌ను అప్పగించాలని జీఎస్కే భావిస్తోంది. అయితే ఆరోగ్య ఆహార పానీయాలలో 44.1శాతం మార్కెట్ వాటా కలిగిన హార్లిక్స్‌ను కొనుగోలు చేసే ఆసక్తి, అర్హత ఎవరికి ఉంది అనేది కీలకంగా మారింది. ఐటీసీ లిమిటెడ్ బహుశా ఇంత పెద్ద కొనుగోలుకు అవసరమైన బ్యాలెన్స్ షీట్ బలం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు హార్లిక్స్ ను సొంతం చేసుకునేందుకు నెస్లే, క్రాఫ్ట్ హీంజ్, యూనీలివర్ వంటి ఆహారోత్పత్తుల సంస్థలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు కోకా-కోలా, పెప్సికో, సంటరీ, మోడెలిజ్ ఇంటర్నేషనల్, కాఫీ బిజినెస్ యజమాని జాబ్ లాంటి ఇతర సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రపంచంలోని అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీగా ఉన్న నెస్లే, జీఎస్కే మధ్య హార్లిక్స్ విక్రయంపై గతంలోనే చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా స్పందించడానికి స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న నెస్లే నిరాకరించింది.
కాగా మాల్ట్ ఆధారిత డ్రింక్ గా ప్రసిద్ధి చెందిన హార్లిక్స్ పౌష్టికాహారం, బిస్కెట్ల రంగంలోకూడా తనకంటూ ఓ ముద్రను వేసుకుంది. సుమారు 140 సంవత్సరాలుగా ఇండియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. 1873లో బ్రిటీష్ సోదరులు జేమ్స్, విలియమ్ హార్లిక్స్ లు తొలిసారిగా షికాగోలో హార్లిక్స్ తయారీని ప్రారంభించారు. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ వార్త జీఎస్‌కే పెట్టుబడిదారులను, ఇటు హార్లిక్స్ అధికంగా ఇష్టపడే వారిని షాక్‌కు గురిచేసింది. కొత్త యజమాని ఆధ్వర్యంలో హార్లిక్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది కాలమే తేల్చాలి.
Comments
Please login to add a commentAdd a comment