health minister kamineni
-
ఉద్యోగులను ఇతర రాష్ట్ర్రాల్లో వైద్యానికి అనుమతించం
మంత్రి కామినేని శ్రీనివాస్ సాక్షి, అమరావతి: గతంలో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వైద్య సేవ కోసం హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళితే అంగీకరించేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. మన రాష్ట్రంలో సంబంధిత వైద్య సౌకర్యం అందుబాటులో లేనప్పుడు, ఇక్కడి ఆస్పత్రులు ఆ వైద్యానికి నిరాకరించినప్పుడు మాత్రమే ఇతర రాష్ట్రాల్లో వైద్యానికి అనుమతిస్తామన్నారు. శనివారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్యోగులు, జర్నలిస్టుల సమస్యలపై ఉద్యోగ, జర్నలిస్టు సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల మాస్టర్ హెల్త్ చెకప్ అంశాన్ని మరోసారి పునఃసమీక్షిస్తామన్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులను రేపు నిర్ణయిస్తామన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి అనుమతి ఉంటే డెస్క్ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్‌లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ కార్డులపై వైద్యం చేయడానికి ఏ ఆస్పత్రి నిరాకరించకూడదని అలాచేస్తే, సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 400 సీట్లకు ఎంసీఐ కోత పెట్టిందని, దానిపై తాము చేసేదేమీ లేదన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అశోక్‌బాబు, జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
లోప భూయిష్టంగా సాగునీటి వ్యవస్థ
లెక్కల్లో తేడా వస్తే సస్పెన్షనే... విజిలెన్స్‌కు అప్పగిస్తాం... వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కౌతవరం (గుడ్లవల్లేరు) : సాగునీటి వ్యవస్థ లోప భూయిష్టంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడేందుకు బుధవారం కౌతవరం ఇరిగేషన్ బంగళాకు వచ్చిన ఆయన కాలువల్లో సాగునీటి పారుదలను పరిశీలించారు. కొందరు తమ స్వార్థం కోసం సాగునీటి వ్యవస్థను నాశనం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ దెబ్బతినటానికి అధికారులే కారణమని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో తన శాఖ పరిధిలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల సమస్య వంటివి ఎన్నో ఇబ్బందులు రాగా, వాటిని స్వయంగా పరిష్కరించానని కామినేని చెప్పారు. తన నియోజకవర్గం కైకలూరుకు సాగునీరే కాదు.. తాగునీరు కూడా కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువలకు నీటి విడుదలపై తన వంటివారు ఇలా రాకుండానే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రాంతానికి విడుదల చేయాల్సిన సాగునీటి వాటా గురించి రైతుల తరఫున అడిగేందుకే వచ్చానన్నారు. ఆయకట్టును బట్టి నీరు విడుదల చేయాలని సూచించారు. సాగునీరు పక్కదారి... బందరు కాలువకు కంకిపాడు–ఉయ్యూరు గేట్ల వద్ద 1,100 క్యూసెక్కుల నీటి వాటాను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రికి గుడివాడ ఏఎంసీ మాజీ చైర్మన్ కొసరాజు వెంకటాద్రిచౌదరి తెలిపారు. బల్లిపర్రు లాకుల వద్ద రెండు గేట్లు పూర్తిగా పాడైపోయినా, వాటిని తెరవకుండా ఉంచారని చెప్పారు. వారం నుంచి తాను రైతులతో వెళ్లి అధికారులతో మాట్లాడితే ఒక గేటు తెరవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్ ఎస్ఈ, సాగునీటి మంత్రి దేవినేని ఉమాతో ఫోనులో మాట్లాడారు. పక్షపాతం చూపొద్దు... జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌ల కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ(చంటి) తన గుడివాడ ప్రాంతంపై పక్షపాతం చూపుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గుడివాడలో తాగునీరు ఉన్నప్పటికీ ఎందుకు వందలాది మోటార్లతో నీటిని తోడుతున్నారని ప్రశ్నించారు. ఇలాగైతే సాగునీరు పక్కదారి పడుతుందనే విషయాన్ని విజిలెన్స్‌కు అప్పగిస్తామని మంత్రి చెప్పారు. కాలువలకు విడుదల చేస్తున్న నీటి విషయంలో లెక్కల్లో తేడాలు వస్తే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, కైకలూరు ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రాజరాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్ సీట్లు
కడప అర్బన్ : రిమ్స్‌లో మరో 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించేందుకు ఎంసీఐకి ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఏడు విభాగాల్లో పీజీ సీట్లు ఉన్నాయని, ఆర్థోపెడిక్, రేడియాలజీ, పిడియాట్రిక్స్ విభాగాల్లో పీజీలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రి, కళాశాల ఆవరణాల్లో పలు విభాగాలను పరిశీలించారు. ఓపీ, ఐపీ విభాగాల్లో రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రిమ్స్ ఐపీ విభాగంలోని సీఎం క్యాంపు ఆఫీసు ఫర్ మెడికల్ కన్సెల్టెన్సీని ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థుల హాస్టళ్లను పరిశీలించారు. వారి మెస్‌లను తనిఖీ చేశారు. ఓపీ విభాగంలోని బయో కెమిస్ట్రీలో వివిధ అనలైజర్ యంత్రాలను, క్షయ నిర్ధారణను తెలియజేసే సీబీ నాట్ యంత్రాన్ని, డెంగీ నిర్ధారించే ఎలీజా యంత్రాన్ని ప్రారంభించారు. రిమ్స్‌లోనే రూ. 1.06 కోట్లతో నిర్మించబోయే జిల్లా బాలల భవిత కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.తర్వాత మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తన పర్యటన ముగించుకుని మీడియాతో మాట్లాడారు. రిమ్స్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ విధానం ప్రస్తుతం 78 శాతం అమలులో ఉందని, దాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలను ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరో వారంలో రిమ్స్‌లో ప్రవేశ పెడతామని తెలిపారు. డాక్టర్ల కొరతను అధిగమించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. డయాలసిస్ విభాగంలో ప్రస్తుతం 17 యూనిట్లు ఉన్నాయని, మరో 18 యూనిట్లను స్థాపించేందుకు సిద్దం చేస్తున్నామన్నారు. వీటిల్లో 10 యూనిట్లు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోనూ, ఎనిమిది కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. దంత వైద్య కళాశాలకు ప్రత్యేకంగా కమిటీ అవసరం లేదని, రిమ్స్ హెచ్‌డీఎస్ కమిటీ వారే పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మంత్రి వెంట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, అడిషనల్ డీఎంఈ బాబ్జి, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ వెంకట శివ, డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యనారాయణరాజు, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.