health sub-centers
-
ఆరోగ్య ఉపకేంద్రం ‘రెడీ’మేడ్
తిర్యాణి(ఆసిఫాబాద్): అది దట్టమైన అటవీప్రాంతం.. రవాణా అంటే హైరానే.. బాహ్య ప్రపంచానికి బహుదూరంగా, నిర్మాణ సామగ్రి తరలింపు భారంగా మారడంతో 15 ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు అది రెడీమేడ్ తరహాలో సిద్ధమవుతోంది. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గుండాల గ్రామపంచాయతీ ఏడు గూడేలతో ఉంటుంది. దట్టమైన అటవీప్రాంతం లోపల ఉండటంతో గ్రామస్తులు విద్య, వైద్యం, నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామానికి ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి 2007లో ఐటీడీఏ ద్వారా రాష్ట్రీయ స్వయం వికాస్ యోజన కింద రూ.7 లక్షలు మంజూరయ్యాయి. నిర్మాణ సామగ్రి తరలింపులో ఇబ్బందులు తలెత్తడంతో కాంట్రాక్టర్ బేస్మెంటు స్థాయిలోనే పనులు నిలిపివేశాడు. 15 ఏళ్లుగా స్తంభించిన పీహెచ్‌ఎసీ భవనం పనులు ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఐటీడీవో పీవో అంకిత్ ప్రత్యేక చొరవతో మళ్లీ ప్రారంభమయ్యాయి. సాధారణ భవనం కట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ బేస్‌మెంట్‌పైనే కేరళకు చెందిన శాంతి మెడికేర్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనే సంస్థ ద్వారా కృత్రిమ గోడల (సిమెంటు ఫైబర్ ప్యానెల్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఆరోగ్య ఉపకేంద్రంలో విశ్రాంతి గది, ఫార్మసీ రూమ్, చికిత్స చేసే గది, హాలు, మరుగుదొడ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని డీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్ తెలిపారు. ఇదే తరహాలో ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించారు. -
నిబంధనలు పట్టవు.. అనుమతులు ఉండవు
సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి ఒక కాంట్రాక్టు ఉద్యోగిని తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలుంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, మార్కులు ఇలా అనేక నిబంధనలను సంతృప్తిపరిస్తేనే ఉద్యోగం దక్కుతుంది. అలాంటిది వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఒక ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించేటప్పుడు ఎన్ని నిబంధనలు ఉండాలి.!?.. అలాంటిది ఈ నిబంధనలన్నింటిని తోసిరాజని ఆరోగ్య ఉప కేంద్రాల్లో టెలి మెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేసే ప్రాజెక్టును గత చంద్రబాబు ప్రభుత్వం ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు కట్టబెట్టేసింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సినదాన్ని గోప్యంగా ముగించేసింది. అంతేకాకుండా సచివాలయంలో దీనికి సంబంధించిన ఫైళ్లు కూడా లేకుండా చేయడం వెనుక మతలబు ఏమిటో ఇట్టే తెలుసుకోవచ్చు. గత టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు కొందరు దీని వెనుక ఉండబట్టే ఇంతగా బరితెగించేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సచివాలయంలో చిన్న ఆధారం కూడా దొరకకుండా చేశారంటే గత టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తమ అవినీతి బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నోట్ ఫైల్ లేకుండానే ఒప్పందం ఏదైనా ప్రాజెక్టుకు ఎంవోయూ (అవగాహన ఒప్పందం) చేసుకునే ముందు నోట్ ఫైల్ రాస్తారు. ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతోపాటు ఈ ప్రాజెక్టు ఎందుకు.. దేని కోసం ఉద్దేశించింది.. ప్రాజెక్టు వ్యయం ఇలా పలు విషయాలను నోట్ ఫైల్లో క్రోడీకరిస్తారు. అవగాహన ఒప్పందానికి ఇది కీలకమైన సమాచార ఫైల్‌గా భావిస్తారు. కానీ ఇ–సబ్ సెంటర్లలో హబ్‌ల ఏర్పాటుకు ఎంవోయూ చేసుకునే సమయంలో కనీసం నోట్ ఫైల్ కూడా పెట్టలేదు. తాజాగా దీనికి సంబంధించిన ఫైళ్లపై ఆరా తీయగా సచివాలయంలో సైతం కనీసం ఒక్క ఫైలు కూడా లేదు. కుటుంబ సంక్షేమ శాఖలో సైతం ఎలాంటి ఫైళ్లూ లేకుండానే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. కింది స్థాయి అధికారులతోనే తతంగమంతా.. వైద్య ఆరోగ్యశాఖలో ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలంటే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ల సంతకాలు తప్పనిసరి. కానీ టెలి హబ్ ప్రాజెక్టుకు సంబంధించి కింది స్థాయి అధికారుల సంతకాలతోనే టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తతంగమంతా నడిపించేశారు. ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో చేయించారు. ఎల్వోఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై మరో జాయింట్ డైరెక్టర్‌తో సంతకం పెట్టించారు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఒకరే ఉన్నారు. కానీ ఆ అధికారి ఎక్కడా సంతకాలు చేయకుండానే కింది స్థాయి అధికారులతోనే చక్రం తిప్పేశారు. విచారణ చేపట్టిన ప్రభుత్వం టెలి మెడిసిన్ హబ్‌ల మీద వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అవగాహన ఒప్పందం, లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లపై సంతకాలు చేసిన ఇద్దరు అధికారులను ప్రశ్నించింది. ఈ ఇద్దరు అధికారులు కూడా అప్పటి ముఖ్య కార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకే సంతకాలు చేశామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరిలో ఒకరు పదవీ విరమణ చేయగా, మరొకరు వైద్య ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ముందు ఒప్పందం.. తర్వాత జీవోనా? ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదు. ముందుగా ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఆ తర్వాత జీవో ఇచ్చారు. 2019 జనవరి 12న ధనుష్ సంస్థకు ఇస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. జీవో మాత్రం ఫిబ్రవరి 15 ఇచ్చారు. ఇందులో కూడా ప్రైవేటుకు ఇస్తున్నట్టు, టెండర్లు పిలవాలని ఎక్కడా లేదు. నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారుల ద్వారా టెలి మెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వమే చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. కానీ అంతకుముందే ధనుష్ ఇన్ఫోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్టును కట్టబెట్టేశారు. అవినీతి విశ్వరూపం.. ► ఆరోగ్య ఉప కేంద్రాలను ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నామని మాత్రమే కేబినెట్ నోట్లో పెట్టారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇస్తున్నట్టు గానీ, అంచనా ఎంత అవుతుందని గానీ చెప్పలేదు. ► ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పరిపాలనా అనుమతులు లేవు. ► జీవో నంబర్ 39లో కూడా ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారానే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రైవేటుకు ఇస్తున్నట్టు చెప్పలేదు. ► ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు బిల్లులు చెల్లించాలని సచివాలయానికి ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో ఏ జీవో నంబర్ ద్వారా టెండరు ఇచ్చారో పేర్కొనాల్సి ఉండగా అలా ఏమీ చేయలేదు. -
నర్సులే బాస్‌లు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య ఉప కేంద్రాలకు నర్సులనే బాస్‌లుగా నియమించాలని సర్కా ర్ నిర్ణయించింది. పల్లెవాసులకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై దృష్టిపెట్టింది. గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులి వ్వడం వంటివి నిర్వహిస్తున్నారు. వీటిలో ఇక నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదాను ఏర్పాటు చేస్తారు. దానికి నర్సులే బాస్‌లుగా ఉంటారు. టీకాలు, మందులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా షుగర్ టెస్టులు, బీపీ చెక్ చేయడం తదితర ఆరోగ్య సేవలు అందిస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. సబ్ సెంటర్లనే హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్ చేస్తారు. ఔట్‌సోర్సింగ్‌లకూ అవకాశం ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన నర్సులను ఉప కేంద్రాల్లో నియమిస్తారు. ఉప కేంద్రాల్లో పనిచేసే నర్సు లకు 6 నెలలు బ్రిడ్జి కోర్సులో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యా క నెలకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తారు. పనితీరు ఆధారం గా నెలకు రూ.15 వేల వరకు పారితోషికం ఇస్తారు. ఎంపికైన వారిలో శాశ్వ త ఉద్యోగులుంటే ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా వారికి వేతనం ఉంటుంది. పారితోషికాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇస్తా రు. ఎంపికైన ఎంఎల్‌హెచ్‌పీలు మూడేళ్ల పాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేయాలి. ఆ మేరకు హామీపత్రం ఇవ్వాలి. వీరు ఉప కేంద్రం ఉన్నచోటే నివాసం ఉండాలి. -
రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు(హెల్త్ సబ్‌సెంటర్లు) నిర్మించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మూడు దశల్లో వాటిని నిరి్మంచేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, తొలి విడత టెండర్లు వీలైనంత త్వరగా పిలిచి జనవరి 3 లేదా 4వ వారంలో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు ఈ ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి కొత్తగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంపై మేనిఫెస్టోలో ఇచి్చన హామీల్లో ఇంత వరకు అమలు చేసిన, ఇక నుంచి అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులు వివరించారు. సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్తగా నిరి్మంచతలపెట్టిన కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఇక నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తేదీలు నిర్ధారించారు. జనవరి 1 నుంచి కొత్త వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డుల జారీని ప్రారంభించాలి. 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ,ని పైలట్ ప్రాజెక్ట్‌గా జనవరి 3 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి మిగిలిన 12 జిల్లాల్లో 1,200 రోగాలకు ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. జనవరి నుంచి పెన్షన్లు పొందే లబ్ధిదారులు ►తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫిలియా, డయాలసిస్ రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్లు ►బోదకాలు, తీవ్ర అనారోగ్యంతో వీల్ చైర్లకు పరిమితమైన వారు, తీవ్ర పక్షవాతంతో బాధపడుతున్నవారికి పెన్షన్లు ►కుష్టు టవ్యాధితో బాధపడుతున్న వారికి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ వైద్య, ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’ కార్యక్రమంపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ జనవరి నుంచి జీతాల పెంపు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలు జనవరి నుంచి రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంపు కొత్త అంబులెన్స్‌లు మార్చి 2020 నాటికల్లా 1,060 కొత్త 104, 108 అంబులెన్స్‌ల కొనుగోలు పోస్టుల భర్తీ వచ్చే ఏడాది మే చివరి నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని పోస్టుల భర్తీ దివ్యాంగులకు వేగంగా సరి్టఫికెట్ల జారీ దివ్యాంగుల కోసం నిర్వహించే సదరం క్యాంపుల్లో రద్దీని తగ్గించడానికి స్లాట్ల సంఖ్యను పెంచామని సీఎంకు అధికారులు తెలిపారు. గతంలో వారానికి కేవలం 2,715 స్లాట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 8,680 స్లాట్లను అందుబాటులోకి తెచ్చామని, బుక్ చేసుకున్న వారం రోజులకే ఇప్పుడు స్లాట్ దొరుకుతుందని అధికారులు వివరించారు. కంటి వెలుగు పథకం కంటివెలుగులో ఇంతవరకూ 64,52,785 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించగా.. 4,33,600 మందికి సమస్య ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. వారిలో 3,59,396 మందిని రెండోదశ పరీక్షించగా.. 1,86,100 మందికి వైద్యం అవసరమని నిర్ధారించారు. 1,36,313 మందికి కంటిఅద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. 41,592 మందికి 5 శాతం పైగా దృష్టిలోపం ఉన్నట్టు నిర్ధారించి వారికి మళ్లీ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. 2 నుంచి 3 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు. వృద్ధులకు కంటి పరీక్షలకు సంబంధించి స్క్రీనింగ్ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ సేవలు నవంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో 72, బెంగళూరులో 35, చెన్నైలోని 23 ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాలిటీ సేవలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 2 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 15 నుంచి ఆస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచగా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశామని చెప్పారు. లబ్దిదారుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించండి పెన్షన్లు తీసుకుంటున్న, ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం పొందుతున్న లబి్ధదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. పెన్షన్లు అందకపోయినా.. ఇతర సాయం రాకపోయినా ఎవరిని సంప్రదించాలి, ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాల్ని సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. ‘ఏప్రిల్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందులు అందించాలి. నాడు – నేడు కింద చేపట్టే కార్యక్రమాలు నాణ్యంగా ఉండాలి. ఆస్పత్రుల్లో బెడ్లు, బాత్రూమ్స్, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. ఈ విషయంలో ఎక్కడా రాజీపడటానికి వీల్లేదు. తీవ్రవ్యాధులతో బాధపడుతున్నవారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి మరింత సులభతరం చేయాలి. ఏఎన్ఎం సాయంతో స్లాట్ బుక్ చేయించి, వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్ జారీచేసేలా చూడాలి. దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనే ఈ పరీక్షలు పూర్తికావాలి. రోగుల కోసం ప్రత్యేకంగా వాహన సదుపాయం ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. -
పులి‘చింతలు’ తీరేదెన్నడో..!
బతకడానికి పనులు లేవు.. పశువులు, జీవాలను మేపుకుంటూ జీవనం సాగిద్దామంటే కను చూపు మేరలో మేత ఉన్న ఖాళీ స్థలం లేదు.. గ్రామాల్లో కనీసం రేషన్ కూడా ఇవ్వడం లేదు.. తాగడానికి మంచినీళ్లు కూడా లేని దుర్భర స్థితి.. బోరు బావుల్లో నీళ్లుతాగి రోగాలపాలవుతున్నాం.. ఆరోగ్య ఉప కేంద్రం లేదు. గత మూడు రోజులుగా పిల్లలు జ్వరాలతో బాధ పడుతున్నా పట్టించుకునే వారు లేరు.. ఎన్నో హామీలు ఇచ్చిన అధికారులు కన్పించడం లేదు.. మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా ప్రజాప్రతినిధులు రారు.. ఇదీ కోళ్లూరు, పులిచింతల ముంపు గ్రామస్థుల ఆవేదన. అచ్చంపేట : పులిచింతల ముంపు గ్రామాలైన బెల్లంకొండ మండలం, పులిచింతల, కోళ్లూరు గ్రామస్థులకు అచ్చంపేట మండలంలోని చిగురుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయంటే గ్రామం మొత్తం మునిగిపోతుందంటూ అధికారులు హడావిడి చేయడంతో ఆయా గ్రామాల నుంచి దాదాపు 400 కుటుంబాలు తరలివచ్చాయి. అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తామన్నారు. నష్టపోయిన భూములకు బదులుగా భూ ములిస్తామన్నారు. లేకుంటే పరిహారం ఇస్తామన్నారు. బతకటానికి పనులు చూపటంతోపాటు పశువులను మేపుకునేం దుకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఇలా ఎన్నో హామీలు ఇవ్వటంతో ఆయా కుటుం బాలు వారు అధికారులను నమ్మారు. అక్కడ వారికున్న సేద్యపు భూములు, గృహాలను వదిలి ఇక్కడకు వచ్చారు. కేవలం రూ. 1.50 లక్షలు ఇచ్చారు.. భూములకు బదులుగా భూములిస్తామని చెప్పిన అధికారులు దానిని పూర్తిగా విస్మరించారు. కోట్ల రూపాయల ఖరీదు చేసే సేద్యపు భూమిని తీసుకొని కేవలం ఎకరాకు రూ. 1.50 లక్షలు ఇచ్చారు. 400 పక్కా గృహాలు మంజూరు చేశారు. బిల్లులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పటంతో నిర్మాణాలు ప్రారంభించారు. ఒకటి, రెండు బిల్లులు ఇచ్చారు. అనంతరం వదిలేశారు. సమస్యలతో సతమతం.. ఉపాధి హామీ పథకం కింద పనులు లేవు. గ్రామాల్లో వ్యవసాయ పనులు కరవు. కృష్ణానది నుంచి పైపులైన్లు వేసి మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. ట్యాంక్ అయితే నిర్మించారు. కానీ చుక్క నీరు సరఫరా చేయలేదు. గత్యంతరం లేక బోరునీళ్లనే తాగుతున్నారు. దీంతో వ్యాధులకు గురవుతూ కాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రేషన్ ఇచ్చే నాథుడు లేడు. రాజుపాలెం వెళ్లి తెచ్చుకోవాలంటే రూ. 200ల ఖర్చు అవుతుంది. పిల్లలు చదువుకునేందుకు పాఠశాల లేదు. అంగన్వాడి కేంద్ర మాత్రం నిర్మించారు. కానీ టీచర్‌ను నియమించలేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా ఒక్కరికి కూడా బిల్లులు చెల్లించని దుస్థితి. ఆరోగ్య ఉపకేంద్రం అందుబాటులో లేదు. ప్రస్తుతం పునరావాస కేంద్రంలో పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు. పట్టించుకునే నాథుడే లేడు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేసింది. మళ్లీ ఎన్నికలు వస్తేగాని ప్రజాప్రతినిధులు మా వద్దకురారు. హాయిగా ఉండే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఏ వసతులు చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. - దేశెట్టి కోటేశ్వరరావు పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు మూడు రోజులుగా పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు. పట్టించుకున్నవారు లేరు. ఇక్కడ ఆరోగ్య కేంద్ర కూడా లేదు. రెండు కిలో మీటర్లు పిల్లలను మోసుకుంటూ వెళ్లి వెద్య చేయించుకోవాల్సి వస్తోంది. మమ్మలి పలుకరించే దిక్కు కూడా లేదు. - కన్నా నారాయణమ్మ -
దళితులే లక్ష్యంగా దాడులు
548 ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు ప్రభుత్వం ఇచ్చేది రూ.250 అది కూడా నాలుగేళ్లుగా పెండింగ్ ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి మచిలీపట్నం/కంచికచర్ల : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు పట్టింది. నాలుగేళ్ల క్రితం పట్టిన ఈ జబ్బును నయం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 548 ఆరోగ్య ఉపకేంద్రాలు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. పేదలకు ప్రాథమిక వైద్యం దూరమయ్యే దుస్థితి దాపురిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 620 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 72 భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 548 ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.250 చొప్పున అద్దె మంజూరు చేస్తోంది. వాస్తవానికి ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,200 వరకు ప్రతి నెలా ఏఎన్ఎంలే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు. భారీగా బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కూడా నాలుగేళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఏడాదికి అద్దె బకాయిలు చెల్లించాలంటే జిల్లా వ్యాప్తంగా రూ.16.44 లక్షలు కావాలి. ప్రభుత్వం ఏటా కేవలం రూ.5 లక్షలకు మించి విడుదల చేయటం లేదు. ఈ నగదు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 25వ తేదీన విడుదల చేసి 31లోపు ఖర్చు చేయాలనే నిబంధన విధిస్తోంది. ఈ సమయంలో ట్రెజరీలో బిల్లులు మార్చుకునేందుకు ఫ్రీజింగ్ అడ్డుగా ఉండటంతో ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించే అవకాశం లేకుండాపోతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొందని డీఎం, హెచ్‌వో జె.సరసిజాక్షి ‘సాక్షి’కి తెలిపారు. అద్దె భారం ఏఎన్ఎంల పైనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ జీతంలో నుంచి ఆయా కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పలువురు ఏఎన్ఎంలు వాపోతున్నారు. ప్రస్తుతం గృహాల అద్దె పెరిగిపోవటంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ఎక్కడ కొనసాగించాలా.. అని ఏఎన్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దె బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పలువురు ఏఎన్ఎంలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.