పులి‘చింతలు’ తీరేదెన్నడో..! | Pulichintala residence problems | Sakshi
Sakshi News home page

పులి‘చింతలు’ తీరేదెన్నడో..!

Published Wed, Jul 8 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

పులి‘చింతలు’ తీరేదెన్నడో..!

పులి‘చింతలు’ తీరేదెన్నడో..!

బతకడానికి పనులు లేవు.. పశువులు, జీవాలను మేపుకుంటూ జీవనం సాగిద్దామంటే కను చూపు మేరలో మేత ఉన్న ఖాళీ స్థలం లేదు..  గ్రామాల్లో కనీసం రేషన్ కూడా ఇవ్వడం లేదు.. తాగడానికి మంచినీళ్లు కూడా లేని దుర్భర స్థితి.. బోరు బావుల్లో నీళ్లుతాగి రోగాలపాలవుతున్నాం.. ఆరోగ్య ఉప కేంద్రం లేదు. గత మూడు రోజులుగా పిల్లలు జ్వరాలతో బాధ పడుతున్నా పట్టించుకునే వారు లేరు.. ఎన్నో హామీలు ఇచ్చిన అధికారులు కన్పించడం లేదు.. మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా ప్రజాప్రతినిధులు రారు.. ఇదీ కోళ్లూరు, పులిచింతల ముంపు గ్రామస్థుల ఆవేదన.
 
 అచ్చంపేట : పులిచింతల ముంపు గ్రామాలైన బెల్లంకొండ మండలం, పులిచింతల, కోళ్లూరు గ్రామస్థులకు అచ్చంపేట మండలంలోని చిగురుపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయంటే గ్రామం మొత్తం మునిగిపోతుందంటూ అధికారులు హడావిడి చేయడంతో ఆయా గ్రామాల నుంచి దాదాపు 400 కుటుంబాలు తరలివచ్చాయి. అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తామన్నారు. నష్టపోయిన భూములకు బదులుగా భూ ములిస్తామన్నారు. లేకుంటే పరిహారం ఇస్తామన్నారు. బతకటానికి పనులు చూపటంతోపాటు పశువులను మేపుకునేం దుకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఇలా ఎన్నో హామీలు ఇవ్వటంతో ఆయా కుటుం బాలు వారు అధికారులను నమ్మారు. అక్కడ వారికున్న సేద్యపు భూములు, గృహాలను వదిలి ఇక్కడకు వచ్చారు.

 కేవలం రూ. 1.50 లక్షలు ఇచ్చారు..
 భూములకు బదులుగా భూములిస్తామని చెప్పిన అధికారులు దానిని పూర్తిగా విస్మరించారు. కోట్ల రూపాయల ఖరీదు చేసే సేద్యపు భూమిని తీసుకొని కేవలం ఎకరాకు రూ. 1.50 లక్షలు ఇచ్చారు.  400 పక్కా గృహాలు మంజూరు చేశారు. బిల్లులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పటంతో నిర్మాణాలు ప్రారంభించారు. ఒకటి, రెండు బిల్లులు ఇచ్చారు. అనంతరం వదిలేశారు.

 సమస్యలతో సతమతం..
 ఉపాధి హామీ పథకం కింద పనులు లేవు. గ్రామాల్లో వ్యవసాయ పనులు కరవు. కృష్ణానది నుంచి పైపులైన్లు వేసి మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. ట్యాంక్ అయితే నిర్మించారు. కానీ చుక్క నీరు సరఫరా చేయలేదు. గత్యంతరం లేక బోరునీళ్లనే తాగుతున్నారు. దీంతో వ్యాధులకు గురవుతూ కాళ్లు, కీళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రేషన్ ఇచ్చే నాథుడు లేడు. రాజుపాలెం వెళ్లి తెచ్చుకోవాలంటే రూ. 200ల ఖర్చు అవుతుంది. పిల్లలు చదువుకునేందుకు పాఠశాల లేదు. అంగన్‌వాడి కేంద్ర మాత్రం నిర్మించారు. కానీ టీచర్‌ను నియమించలేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా ఒక్కరికి కూడా బిల్లులు చెల్లించని దుస్థితి. ఆరోగ్య ఉపకేంద్రం అందుబాటులో లేదు. ప్రస్తుతం పునరావాస కేంద్రంలో పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు.

 పట్టించుకునే నాథుడే లేడు
 మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేసింది. మళ్లీ ఎన్నికలు వస్తేగాని ప్రజాప్రతినిధులు మా వద్దకురారు.  హాయిగా ఉండే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఏ వసతులు చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
- దేశెట్టి కోటేశ్వరరావు
 
 పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు
 మూడు రోజులుగా పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్నారు. పట్టించుకున్నవారు లేరు. ఇక్కడ ఆరోగ్య కేంద్ర కూడా లేదు.  రెండు కిలో మీటర్లు పిల్లలను మోసుకుంటూ వెళ్లి వెద్య చేయించుకోవాల్సి వస్తోంది. మమ్మలి పలుకరించే దిక్కు కూడా లేదు.        
 - కన్నా నారాయణమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement